నిజమేనా.? వాళ్ళంతా పవన్ కళ్యాణ్‌కి ‘కాపు’ కాస్తారా.?

మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి కాపులు గంపగుత్తగా మద్దతిచ్చేశారా.? ఇవ్వలేదు. కానీ, ప్రజారాజ్యం పార్టీ మీద ‘కాపు ముద్ర’ బలంగా పడింది. అలా ఆ ముద్ర వేయడంలో అప్పటి కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ విజయం సాధించాయి. రాజకీయాలంటేనే అంత.

టీడీపీ మీద కమ్మ పార్టీ అనే ముద్ర వుంది. వైఎస్సార్సీపీ మీద రెడ్ల పార్టీ అనే ముద్ర వుంది. ఇవి రాజకీయంగా పడే ముద్రలు మాత్రమే. అధికారంలోకి వచ్చాక ఆయా సామాజిక వర్గాల్లోని కొందరు హైలైట్ అవుతుంటారు. అదే అంశాన్ని పట్టుకుని ఆయా రాజకీయ పార్టీలు ఆయా సామాజిక వర్గాలకు మాత్రమే ప్రాధాన్యతనిస్తుంటాయనే ప్రచారమూ జరుగుతుంటుంది.

టీడీపీలో రెడ్డి సామాజిక వర్గ నేతలున్నారు, ఇతర పార్టీల్లోనూ వున్నారు. చంద్రబాబుని ఘాటుగా విమర్శించే కమ్మ సామాజిక వర్గ నేతలు వైసీపీలో కూడా వున్నారు. పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయితే, ఆయనకు జనసేన పార్టీలో మద్దతిచ్చే కమ్మ, రెడ్డి సామాజిక వర్గ నేతలు చాలామందే వున్నారు.

రాజకీయానికి కులం, మతం, ప్రాంతీయత ఆపాదించడం ఎంతవరకు సబబు.? అని ఆయా రాజకీయ పార్టీలు ఆలోచించుకోవాలి. ఇక, బాహాటంగానే పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి చెందిన పెద్దలంతా పునరాలోచించుకోవాలనీ, రాష్ట్రం బాగు పడటం కోసం జనసేన పార్టీకి మద్దతివ్వాలనీ బాహాటంగానే పిలుపునిస్తున్నారు.

అదొక్కటే కాదు, మిగతా సామాజిక వర్గాలకీ, మైనార్టీలకీ, అందరికీ ఇదే పిలుపునిస్తున్నారు పవన్ కళ్యాణ్. కానీ, పవన్ ఇచ్చిన పిలుపు నేరుగా కాపు సామాజిక వర్గాన్ని తాకింది. అలాగని, కాపు నాయకులంతా పవన్ కళ్యాణ్‌కి గంపగుత్తగా మద్దతిచ్చేస్తారా.? చిరంజీవి పొందలేని ఆ ‘కాపు’ మద్దతుని పవన్ కళ్యాణ్ దక్కించుకోవడం అంత తేలికైన వ్యవహారం కాదు. వైసీపీ నుంచి కన్నబాబు సహా కాపు సామాజిక వర్గ నేతలు చాలామంది పవన్ కళ్యాణ్ తీరుని తప్పుపడుతున్న సంగతి తెలిసిందే.

రాష్ట్రంలో కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో రాజకీయాల్లేవని ఎవరైనా అనుకుంటే అంతకన్నా హాస్యాస్పదం వుండదు. అలాగని, ఈ తరహా రాజకీయాలు చేయడం ద్వారా ఆయా పార్టీలు ఆయా సామాజిక వర్గాల్ని ఉద్ధరించేస్తాయా.? అంటే అదీ లేదు. ఆయా సామాజిక వర్గాల్లో ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత స్థానాల్లో వున్నవారికే మరిన్ని అవకాశాలు దక్కుతాయి. ఇది చరిత్ర చెబుతున్న సత్యం.