హర్యానా గవర్నర్, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ప్రతి యేడాదీ విజయదశమి తర్వాత అలయ్ బలయ్ కార్యక్రమాన్ని గత కొన్నేళ్ళుగా నిర్వహిస్తూ వస్తున్న సంగతి తెలిసిదే. ఈ ఏడాదీ ఆ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి అలయ్ బలయ్ కార్యక్రమంలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యారు.
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తాజా అధ్యక్షుడు మంచు విష్ణు, ఈ కార్యక్రమానికి హాజరవడమే కాదు, ఓ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం గమనార్హం. అందులో ఆయన పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించి, ‘ఈ వీడియో చివర్లో వున్నదెవరో ఊహించండి..’ అంటూ పజిల్ వదిలాడు.
దీనిపై పవన్ కళ్యాణ్ అభిమానులు విపరీతమైన ట్రోలింగ్ చేశారు. మరోపక్క, పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ముఖ్య అతిథుల కోటాలో కూర్చుంటే, ఆ వెనుకాల మంచు విష్ణు కూర్చున్నాడు. అయితే, పవన్ కళ్యాణ్ ఏమాత్రం మంచు విష్ణుని పట్టించుకోలేదనీ, మంచు విష్ణు తనంతట తానుగా పలకరించాలనుకున్నా, అతన్ని పవన్ లెక్క చేయలేదనీ అంటున్నారు.
ఇటీవల ‘మా’ ఎన్నికల సమయంలో పోలింగ్ రోజున, చిరంజీవిని మంచు విష్ణు లైట్ తీసుకున్నట్లుగా కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. దాంతో పవన్ కళ్యాణ్ ఆగ్రహించారా.? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ సభ్యుడిగా వున్న ‘మా’ అసోసియేషన్‌కి మంచు విష్ణు ఇప్పుడు అధ్యక్షుడు.
మెగా కాంపౌండ్ సపోర్ట్ చేసిన (అలా చెప్పబడుతున్న) ప్రకాష్ రాజ్ ప్యానెల్ మీద మంచు విష్ణు ప్యానెల్ విజయం సాధించిన విషయం తెలిసిందే. పదే పదే మెగా కాంపౌండ్‌ని ఈ విషయమై మంచు విష్ణు అండ్ టీమ్ టార్గెట్ చేస్తుండడంతో పవన్ ఒకింత అసహనంతో వున్నారనే చర్చ జరుగుతోంది. అయితే, మంచు విష్ణు సోదరుడు ఇటీవల పవన్ కళ్యాణ్‌ని కలిసి వివాదానికి ముగింపు పలికేందకు ‘మధ్యవర్తిత్వం’ వహించాడనే వాదనా లేకపోలేదు.