Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకి పూర్తిస్థాయిలో మద్దతు తెలియజేస్తూ కూటమి పార్టీలు అధికారంలోకి రావడానికి దోహదం చేశారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకి మద్దతు తెలియజేయడానికి గల కారణం ఏంటనే విషయం గురించి పలు సందర్భాలలో తెలియచేశారు. తాజాగా మరోసారి చంద్రబాబు నాయుడుకి మద్దతు తెలపడానికి గల కారణాలను వివరించారు.
ఉగాది పండుగను పురస్కరించుకొని కూటమి ప్రభుత్వం ఆదివారం అమరావతిలో పీ-4 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కల్యాణ్ పీ-4 లోగోను ఆవిష్కరించారు. పీ-4 కోసం ప్రత్యేక పోర్టల్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ…
పీ4 వల్ల 30 లక్షల కుటుంబాల జీవితాల్లో మార్పులు వస్తాయని తెలిపారు. కష్టాల్లో ఉన్న కుటుంబానికి కాస్త ధైర్యం చెప్తే చాలు వారికి కొండంత ధైర్యం ఉంటుందని తెలిపారు.తెలుగు ప్రజలు బాగుండాలని సీఎం, నేను కోరుకుంటామని తెలిపారు. ఈ క్రమంలో గత ప్రభుత్వం పై మరోసారి మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులను అనేక ఇబ్బందులకు గురిచేసిందని అన్నారు.
గత ఐదేళ్లు రాష్ట్రం కష్టాల్లో ఉందని. కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అంటే చంద్రబాబు నాయుడు వంటి గొప్ప నాయకుడు రావాలని కోరుకున్నాను అందుకే చంద్రబాబు నాయుడుకి తన పూర్తి మద్దతు తెలియజేశాను అంటూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకి మద్దతు తెలియజేయడానికి గల కారణాలను తెలిపారు.