ఎక్కడా లేని చిత్ర విచిత్రమైన రాజకీయాలకు ఆంధ్రప్రదేశ్ ఎందుకు కేరాఫ్ అడ్రస్ అవుతోందన్నది సగటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎప్పటికీ అర్థం కావడంలేదు. విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణ నిర్ణయం కేంద్రానిది. ‘రాష్ట్రానికి చెప్పే చేస్తున్నాం..’ అంటూ చేతులు దులిపేసుకుంది కేంద్రం.
దేశంలో అభివృద్ధిని అటకెక్కించేసి, అమ్మకాల మీద కేంద్రం స్పెషల్ ఫోకస్ పెట్టింది. వీలైనంత మేర ఆస్తులు, సంస్థల్ని అమ్మేసి సొమ్ము చేసేసుకుని, దాన్నే అభివృద్ధిగా చూపాలన్నది కేంద్రం ఆలోచనగా కనిపిస్తోంది. రాష్ట్రాలూ ఇందుకు భిన్నంగా ఏమీ వ్యవహరించడంలేదు.
విశాఖ ఉక్కు పరిశ్రమ 30 మందికి పైగా ప్రాణ త్యాగాలతో ఏర్పడింది. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు. ఇది నినాదం మాత్రమే కాదు.. అంతకు మించి. ఆంధ్రులంటే అప్పటి అర్థం వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు.. అనే నినాదానికి అప్పటి తెలంగాణ సహా చాలా ప్రాంతాలకు చెందినవారు మద్దతిచ్చారు.. ఉద్యమంలో పాల్గొన్నారు.
అలాంటి ఉక్కు పరిశ్రమను అమ్మేయాలని కేంద్రం భావిస్తోంది.. కేవలం భావించడం కాదు, అమ్మకం దిశగా వడివడిగా అడుగులేస్తోంది. మరి, కేంద్రంలో అధికారం వెలగబెడ్తోన్న బీజేపీకి మిత్రపక్షమైన జనసేన ప్రశ్నించాల్సిందెవర్ని.? కేంద్రాన్నే కదా.? కానీ, గల్లీలో వైసీపీని నిలదీస్తున్నారు జనసేనాని.
పవన్ కళ్యాణ్ సినీ నటుడు.. ఆయన్ని చూసేందుకు వేలాదిమంది ఎగబడ్తారు. ఆ జన సందోహాన్ని చూస్తే, పవన్ మాటలు హద్దులు దాటేస్తాయ్. ఇక్కడా అదే జరిగింది. విశాఖలో పవన్ బహిరంగ సభ సందర్భంగా కేంద్రాన్ని విమర్శించేందుకు సాహసించలేదు. కానీ, వైసీపీని తూర్పారబట్టారు. నిజమే, ఇందులో వైసీపీ తప్పు కూడా వుంది. టీడీపీ తప్పు కూడా లేకపోలేదు. కానీ, అందరూ కలిసి కేంద్రం పైన కదా పోరాడాల్సింది.? అదే వుంటే, రాష్ట్రం పరిస్థితి ఎందుకిలా తగలడుతుంది.?