కులం చుట్టూనే నడుస్తున్న జనసేనాని రాజకీయం


కుల రహిత సమాజం అంటాడు.. అధికారానికి దూరంగా ఉన్న వర్గాలన్నీ నడుం బిగించాలంటాడు. కమ్మ సామాజిక వర్గం అంటాడు. కాపు సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం అని మాట్లాడతాడు. ఎక్కడో పవన్ కళ్యాణ్ ప్రసంగాల్లో స్పష్టమైన లోటు, తేడా కలగలిసిపోతోంది. అయితే, ఓ సామాజిక వర్గం వైపు స్టాండ్ తీసుకోవచ్చు. లేదంటే, వాటి గురించి ప్రస్థావించకుండా ఉండొచ్చు. కలగాపులగం చేసేస్తున్నాడు.

రాజకీయం మొదలెట్టానంటూ, వర్గ రాజకీయాన్ని రెచ్చగొడుతున్నాడు, నిజమే, కొన్ని వర్గాలకే అధికార పీఠం దక్కుతోంది. కానీ, అందరూ ఓట్లేస్తేనే, అందరూ మద్దతిస్తేనే అధికార పీఠం ఎవరో ఒకరు ఎక్కగలుగుతారు. ఈ విషయం పవన్ కళ్యాణ్ తెలుసుకోకపోతే ఎలా.?

రోడ్లమీద గుంతలతో ప్రజలకు కలిగే నష్టం కంటే, రాజకీయ నాయకుల మనసుల్లో ఏర్పడే వర్గ రాజకీయం అనే గుంతల వల్ల సమాజానికి కలిగే నష్టం చాలా ఎక్కువ. ఇదంతా నాణానికి ఓ వైపు మాత్రమే. నేటి రాజకీయం కుల, మత, వర్గ రాజకీయాల చుట్టూనే నడుస్తోంది. తప్పెవరిది.? అంటే, అందరిదీనూ. అందరూ ఆ రొచ్చులోనే రాజకీయాన్ని వెతుక్కుంటున్నారు.

తెల్ల బట్టలేసుకుని రాజకీయ నాయకులు, రాజకీయం చేసేస్తుంటారు. తెల్ల బట్టల్లో ఉన్న రాజకీయ నాయకుల బురద ప్రజలకు కనిపిస్తూనే ఉంటుంది. ఏ కార్యక్రమం కోసం జనంలోకి వెళ్లాం.. ఏం మాట్లాడుతున్నాం అనేది.. పవన్ కళ్యాణ్ సమీక్షించుకోవాలి. నిజానికి ఇటీవల మంగళగిరిలో పవన్ కళ్యాణ్ ప్రసంగం అద్భుతంగా సాగింది. తడబాటు లేదు. కానీ, శ్రమదానం పేరుతో జనంలోకి వెళ్లేసరికి సీన్ మారపోయింది. తడబాటుకు గురైన పవన్, ఏవేవో మాట్లాడేశారు.

గోదారి జిల్లాల యువతకి రాయలసీమ పాఠాలు నేర్పుతానన్నారు. అదీ సవివరంగా పేర్కొనలేదు. తాను లక్ష్యంగా పెట్టుకున్న ఓ సామాజిక వర్గాన్నీ ఆకర్షించలేకపోయారు. బహుశా అభిమానుల అనవసరపు రగడ కారణంగా పవన్ తన ప్రసంగం మీద అదుపు కోల్పోయారేమో.