Pawan and Jagan : చంద్రబాబుతో కుమక్కయిన పవన్, వైఎస్ జగన్.!

Pawan and Jagan :  రాజకీయాల్లో విమర్శలు సహజం. చంద్రబాబు మీద నానా విమర్శలు చేసినంతమాత్రాన, చంద్రబాబు పుట్టినరోజునాడు శుభాకాంక్షలు చెబితే తప్పేంటట.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ‘వచ్చేశాడండోయ్ దత్త పుత్రుడు.. తన యజమాని చంద్రబాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేశాడహో..’ అంటూ వైసీపీ శ్రేణులు నానా యాగీ చేశాయి సోషల్ మీడియాలో.

‘చంద్రబాబుకి దత్త పుత్రుడు పవన్ అని దీంతో నిరూపితమయిపోయింది.. బుద్ధి చూపించావ్..’ అంటూ వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ మీద చేసిన ట్రోలింగ్ అంతా ఇంతా కాదు.

ఇంతలోనే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా చంద్రబాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు సోషల్ మీడియాలో. ఇంకేముంది, జనసేన శ్రేణులు కౌంటర్ ఎటాక్ మొదలు పెట్టాయ్. ‘చంద్రబాబు దత్త పుత్రుడు వైఎస్ జగన్.. మీ సిద్ధాంతం ప్రకారం అయితే ఇదే నిజం..’ అంటూ జనసైనికులు తీవ్రస్థాయిలో ట్రోలింగ్ మొదలు పెట్టారు.

ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి పుట్టినరోజునాడు.. ఇలా సోషల్ మీడియా హోరెత్తిపోయింది. ఇంకోపక్క, టీడీపీ అధినేత చంద్రబాబు మీద వైసీపీ శ్రేణుల శాపనార్ధాలు మామూలే. వాటికి టీడీపీ మద్దతుదారుల కౌంటర్ ఎటాక్ కూడా మామూలే.

సరే, ఈ సోషల్ ట్రోలింగ్‌ని కాస్సేపు పక్కన పెడితే, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు టీడీపీ అధినేత చంద్రబాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు సోషల్ మీడియా వేదికగా.