36 ప‌రుగుల‌కే చాప చుట్టేసిన భార‌త్.. పాకిస్తాన్‌లో ఓ రేంజ్‌లో సంబురాలు

ఇంట్లో పులి వీధిలో పిల్లి అన్న చందాన మారింది టీమిండియా ప‌రిస్థితి. సొంత గ‌డ్డ‌పై ఏ టీంనైన మ‌ట్టి క‌రిపిస్తాం అన్న‌ట్టు క‌నిపించే భార‌త్ విదేశి ప‌ర్య‌ట‌న‌లో దారుణంగా ఫ్లాప్ అవుతూ వ‌స్తుంది. రీసెంట్‌గా జ‌రిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో అత్యంత దారుణంగా 36 ప‌రుగుల‌కి ఆలౌట్ కావ‌డంతో మ‌న దేశానికి చెందిన క్రికెట్ ప్రియులే కాదు స్టార్ క్రికెట‌ర్స్ కూడా మండిప‌డుతున్నారు. ఇంత చెత్త రికార్డుని భార‌త్ త‌మ ఖాతాలో వేసుకున్నందుకు పాకీస్తానీయులు అయితే పండుగ చేసుకుంటున్నారు.

డిసెంబ‌ర్ 19,2020 ఇండియ‌న్ క్రికెట్ చ‌రిత్ర‌లో ఓ చీక‌టి అధ్యాయంగా మారింది. అడిలైడ్ వేదిక‌గా జ‌రిగిన డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్‌లో భార‌త్ రెండో ఇన్నింగ్స్ 36 ప‌రుగుల‌కే ముగిసింది.ఇది చూసిన కోట్లాది మంది అభిమానుల గుండెలు బ‌ద్ధ‌ల‌య్యాయి. ఒక‌రి త‌ర్వాత పెవీలియ‌న్‌కు వెళ‌దాం అని చెప్పుకున్న‌ట్టే ఇలా వచ్చి అలా వెళ్ల‌డాన్ని ఎవ‌రు జీర్ణించుకోలేక‌పోయారు. ఇంతటి దారుణ‌మైన అవ‌మానాన్ని మూట‌గ‌ట్టుకున్న కోహ్లీ సేన‌పై వీరేంద్ర సెహ్వాగ్ కూడా విమ‌ర్శ‌లు గుప్పించాడు. ఇండియ‌న్ ఫ్యాన్స్‌. మ‌ర‌చిపోవాల్సిన ఓటీపీ 49204084041 అంటూ ప‌రువు తీసాడు.

ఒకవైపు మ‌నోళ్ళు ఈ బాధ‌ని దింగ‌మింగుకునే ప్ర‌య‌త్నం చేస్తుండ‌గా, పాకిస్తానీయులు మాత్రం సంబురాలు చేసుకుంటున్నారు. ట్విట‌ర్‌లో ఇండియ‌న్ టీమ్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. భార‌త‌ టెస్ట్ క్రికెట్ చ‌రిత్ర‌లో అతి త‌క్కువ స్కోరుకు కోహ్లి సేనఆలౌట్ కాగా .. పాకిస్థాన్ ట్విట‌ర్‌లో 36ఆలౌట్ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అయింది. ఇండియ‌న్ గ‌డ్డ‌పై ఇర‌గదీస్తామ‌ని విర్ర‌వీగే భార‌త ప్లేయ‌ర్స్ ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై తోక ముడిచారేంటి అని ఒక‌రు, థ్యాంక్యూ 2020 అని మ‌రొక‌రు.. మా బౌల‌ర్ సెంచ‌రీ చేసి గ్రౌండ్‌లో టీమిండియా 36కే ఆలౌటైంద‌ని ఇంకొక‌రు టీమిండియాని ఆడేసుకుంటున్నారు. ఇంతటి అప‌కీర్తిని మూటగ‌ట్టుకున్న టీమిండియా దీనిని అంద‌రు మ‌ర‌చిపోయేలా చేయాలంటే టెస్ట్ సిరీస్ త‌ప్ప‌క గెల‌వాల్సి ఉంది.