కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులంతా ఇక విధులకు వెళ్లాల్సిందే … కీలక ఆదేశాలు జారీ !

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులంతా ఇక నుండి తప్పనిసరిగా తమ కార్యాలయాల్లో విధులకు హాజరు కావాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు సిబ్బంది మంత్రిత్వ శాఖ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. కరోనా కేసులు పెరుగుతూ, లాక్ డౌన్ అమలులోకి వచ్చిన వేళ, ఉద్యోగులు ఆఫీసులకు హాజరు కాకుండా సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

All Central Govt Employees Must Attened Offices

ఇప్పుడిక కొత్త కేసుల సంఖ్య కనిష్టానికి పడిపోవడంతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే కంటైన్మెంట్ జోన్ల‌లో ఉన్న వాళ్ల‌కు మాత్రం దీని నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇప్ప‌టి వ‌ర‌కూ అండ‌ర్ సెక్ర‌ట‌రీ, ఆపై స్థాయి అధికారులు మాత్రమే ఆఫీసుల‌కు వ‌స్తున్నారు. క‌రోనా కార‌ణంగా గ‌తేడాది మార్చి నుంచి ఇదే విధానం అమ‌లు చేస్తున్నారు. ఇక గ‌తేడాది మేలో డిప్యూటీ సెక్ర‌ట‌రీ కంటే త‌క్కువ స్థాయి ఉద్యోగుల్లో 50 శాతం మందిని ఆఫీసుల‌కు రావాల్సిందిగా కేంద్రం ఆదేశించింది.

అయితే తాజా ఆదేశాల ప్ర‌కారం ఇక నుంచి అన్ని స్థాయిల అధికారులు ఆఫీసుల‌కు వెళ్లాల్సిందే. కాక‌పోతే ఆయా శాఖ‌ల విభాగాధిప‌తులు సూచించిన మేర‌కు వివిధ స‌మ‌యాల్లో ఆఫీసులకు వెళ్లాల్సి ఉంటుంది. ఇక ఆఫీసుల్లో రద్దీ అధికం కాకుండా ఉద్యోగులకు వివిధ రకాల టైమ్ స్లాట్ లను నిర్దారించుకోవాలని, వాటి ప్రకారం, అందరు అధికారులూ వీక్ డేస్ లో ఆఫీసులకు రావాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. ఈ విషయంలో ఏ కేటగిరీ వారికి కూడా మినహాయింపులు ఉండబోవని పేర్కొంది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకూ బయో మెట్రిక్ అటెండెన్స్ ను మాత్రం తప్పనిసరి చేయబోవడం లేదని వెల్లడించింది.