Hindupur District : అరరె.! నందమూరి బాలకృష్ణ తనను గెలిపించిన హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోకి వచ్చారె.! ఔను, వచ్చారు. హిందూపురం జిల్లా కోసం బాలయ్య నడుం బిగించారు. స్థానికంగా వున్న అఖిలపక్ష నేతలతో కలిసి బాలయ్య ఉద్యమబాటపట్టారు. ర్యాలీ నిర్వహించేస్తున్నారు.!
ఎన్నాళ్ళకెన్నాళ్ళకు.. అంటూ బాలయ్య అభిమానులు, హిందూపురంలో బాలయ్యను గెలిచిపించిన ప్రజలు, టీడీపీ కార్యకర్తలు తమ అభిమాన నటుడు, నాయకుడు, ప్రజా ప్రతినిథిని చూసి మురిసిపోతున్నారు.
ఎమ్మెల్యేగా బాలయ్య హిందూపురం నుంచి రెండోసారి గెలిచారు. ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ, సొంత నియోజకవర్గంలో ప్రజల సమస్యల పట్ల బాలయ్య ఏనాడూ చిత్తశుద్ధితో వ్యవహరించలేదన్న విమర్శలున్నాయి. ‘జోక్ కాదు సీరియస్..’ అంటూ ఆ మధ్య ఓ విషయమై బాలయ్య హిందూపురంలో మాట్లాడిన మాటలు ఇప్పటికీ వైరల్ అవుతూనే వున్నాయి.
బాలయ్య తన సొంత నియోజకవర్గానికి వెళ్ళినా, ఇంకెక్కడికైనా వెళ్ళినా.. అక్కడ అభిమానుల అత్యుత్సాహం మామూలే. నిజానికి, బాలయ్యకే కాదు.. చాలామంది హీరోలకి, హీరోయిన్లకీ అభిమానుల నుంచి ఎదురయ్యే అత్యుత్సాహం ఒకింత ఇబ్బందికరంగా వుంటుంది. కానీ, బాలయ్య రూటే సెపరేటు. అభిమానుల చెంప పగలగొట్టేస్తుంటారాయన.
ఈసారి అలాంటి ‘లవ్ మేకింగ్ సీన్స్’ హిందూపురంలో చోటు చేసుకున్నాయా.? అని బాలయ్య అభిమానులే ఆరా తీస్తుండడం గమనార్హం. హిందూపురం జిల్లా సంగతి పక్కన పెడితే, ప్రత్యేక హోదా సహా చాలా అంశాలపై బాలయ్య ఎందుకు పెదవి విప్పరు.? ఆ ఒక్కటీ అడక్కూడదంతే.