‘మా’ ఎన్నికలతో వైఎస్సార్సీపీకేంటి సంబంధం.?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు గతంలో ఎన్నడూ లేనంత వాడి, వేడిగా జరుగుతున్నాయి. హీరో మంచు విష్ణు, ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్.. తమ తమ ప్యానళ్ళతో తలపడుతున్నారు. వెయ్యి మంది కూడా సభ్యులు లేని ఓ అసోసియేషన్ ఎన్నికలు, జాతీయ స్థాయి సార్వత్రిక ఎన్నికలన్నంత హంగామా నడుమ జరుగుతున్నాయి.

తప్పెవరిది.? ఇంకెవరిది.. సినీ పరిశ్రమలోనివారిదే. కులం పేరు తెస్తున్నారు.. ప్రాంతీయ వాదాల్ని తెరపైకి తెస్తున్నారు.. ఆత్మగౌరవమంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంలోకి రాజకీయ పార్టీల పేర్ల ప్రస్తావన కూడా వచ్చింది. దీంతో, వైసీపీ నేత, ఏపీ మంత్రి పేర్ని నాని స్పందించాల్సి వచ్చింది.

‘మా’ ఎన్నికలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేని పేర్ని నాని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ ఈ ఎన్నికలతో సంబంధం లేదని చెప్పారాయన. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఈ ఎన్నికల పట్ల ఆసక్తి చూపడంలేదని తేల్చి చెప్పారు.

మంచు విష్ణు, తన తండ్రి మోహన్ బాబుతో కలిసి 2019 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరిన విషయం విదితమే. వైసీపీ తరఫున మోహన్ బాబు ఎన్నికల ప్రచారం కూడా చేశారు. ఆయనిప్పుడు తన కుమారుడ్ని గెలిపించుకునే పనిలో బిజీగా వున్నారు. మోహన్ బాబు వైసీపీ నేత కావడంతో, వైసీపీ రాజకీయం ‘మా’ ఎన్నికల్లో వుందనే ప్రచారం జరుగుతోంది.