రోడ్లకు మరమ్మత్తులు.. ఇది పవన్ కళ్యాణ్ తెచ్చిన మార్పు.?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల దుస్థితి అందరి కళ్ళకీ కనిపిస్తూనే వుంది రెండున్నరేళ్ళుగా. అంతకు ముందు గొప్పగా వుందా.? అంటే, మరీ ఇంత దారుణంగా అయితే లేదు. రోడ్లు అభివృద్ధికి చిహ్నాలు. సంక్షేమ పథకాల్ని కాస్త ఆపి అయినా, రోడ్లను బాగు చేయించాల్సి వుంది. కానీ, వర్షాలనీ ఇంకోటనీ వైఎస్ జగన్ సర్కార్ కుంటి సాకులు చెబుతూ వచ్చింది రెండేళ్ళ నుంచీ.

ఈ రోడ్ల దుస్థితిపై జనసేన పార్టీ ఫోకస్ పెట్టింది.. పోరుబాట పట్టింది. ఇంకోపక్క, రోడ్లను బాగు చేసేందుకు టెండర్లను పిలిచాం.. నిధులు కేటాయిస్తున్నాం.. అంటూ ప్రభుత్వం చెబుతున్న మాటలు వినీ వినీ జనం విసిగిపోయారు. సరిగ్గా ఈ తరుణంలోనే జనసేన అధినేత ‘శ్రమదానం’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇంకోపక్క వైసీపీ – జనసేన మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరింది. రేపు పవన్, రోడ్ల మీదకు రానున్నారు.

దాంతో, అధికార పార్టీ ఒకింత కలవరానికి గురయ్యింది. ప్రభుత్వంలోనూ అలజడి బయల్దేరింది. రాత్రికి రాత్రి రోడ్ల మరమ్మత్తులకు సిద్ధపడింది ప్రభుత్వం. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రోడ్లను బాగు చేసే ప్రకియ మొదలైంది. ప్రధానంగా ఎక్కడైతే పవన్ కళ్యాణ్ శ్రమదానం చేయనున్నారో.. అక్కడ వేగంగా పనులు చేసేస్తున్నారు అధికారులు.

‘మీరు బాగా పరిపాలిస్తే, నేనెందుకు రోడ్ల మీదకు వస్తాను.? నేను చక్కగా సినిమాలు చేసుకుంటాను కదా.?’ అని గతంలో పవన్ ఓ మాట అనడాన్ని వైసీపీ ఇంకో కోణంలో తీసుకుంది. కానీ, ఇప్పుడు పరిస్థితిని అర్థం చేసుకున్నట్టుంది.

పవన్ దెబ్బకి ప్రభుత్వం దిగొచ్చిందా.? ప్రభుత్వం దిగొచ్చే సమయానికి పవన్ తన కార్యక్రమాన్ని డిజైన్ చేసుకున్నారా.? అన్న సంగతిని పక్కన పెడితే, పవన్ కళ్యాణ్.. జనం మదిలో తనదైన ముద్ర వేసుకోగలుగుతున్నారు ఈ రోడ్ల వ్యవహారానికి సంబంధించి.. అన్నది మాత్రం నిర్వివాదాంశం.