పవన్ అభిమానులకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. పవర్ స్టార్ పునరాగమనాన్ని ఏదో భారీ లెవల్లో సెలబ్రేట్ చేద్దామని అనుకున్న ఫ్యాన్స్ ఆశలు తీరేలా కనబడట్లేదు. కోవిడ్ కారణంగా సినిమాకు పలు విషయాల్లో బ్రేకులు పడుతూనే ఉన్నాయి. ముందుగా సినిమా ప్రీరిలీజ్ వేడుకను భారీ ఎత్తున చేయాలని అనుకున్నారు. నిర్మాత దిల్ రాజు ఏకంగా 2 కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీ అయ్యారు. కానీ పోలీసుల నుండి అనుమతి లభించలేదు. వేలమందితో ఈవెంట్ అంటే కుదరని పని అని, అనుమతులు ఇచ్చేది లేదని తేల్చి చెప్పేశారు.
ఇక తాజాగా సినిమాకు బెనిఫిట్ షోలు, ఎర్లీ మార్నింగ్ షోలు లాంటివి కూడ లేవట. 9వ తేదీ సినిమా రిలీజ్ కాబట్టి 8 అర్థరాత్రి నుండి బెనిఫిట్ షోలు, 9 తెలవారుఘామున స్పెషల్ షోలు ప్లాన్ చేశారు. బెనిఫిట్ షో టికెట్ ధరను 1500, ఎర్లీ మార్నింగ్ షో టికెట్ రేటును 500 పెట్టాలని భావించారు. కానీ పోలీసులు మాత్రం అలాంటి స్పెషల్ షోలు ఏవీ కుదరవని, అంతా మామూలుగానే ఉంటుందని, రోజుకు నాలుగు షోలు మాత్రమేనని డిసైడ్ చేశారు. దీంతో బెనిఫిట్ షోలతో రచ్చ చేయాలని అనుకున్న అభిమానుల ఆశలకు గండి పడ్డట్టైంది.