యంగ్ హీరోల్లోని ప్రామిసింగ్ హీరోల్లో నిఖిల్ కూడ ఒకరు. రీజనబుల్ బడ్జెట్లో నిఖిల్ ను పెట్టి సినిమా తీస్తే సేఫ్ జోన్లో ఉండొచ్చనేది నిర్మాతల అభిప్రాయం. ప్రేక్షకుల్లో నిఖిల్ సినిమాలంటే మంచి అభిప్రాయమే ఉంది. ఆయన గత చిత్రం ‘అర్జున్ సురవరం’ మంచి విజయాన్ని అందుకుంది. దీంతో హిట్ ట్రాక్ ఎక్కిన నిఖిల్ ఏకంగా నాలుగు సినిమాలను లైన్లో పెట్టారు. వాటిలో ఒకటి చందూ మొండేటి దర్శకత్వంలో చేస్తున్న ‘కార్తికేయ -2′. భారీ వ్యయంతో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ చిత్రం మీద నిఖిల్ చాలా నమ్మకంగా ఉన్నారు. ఇది కాకుండా రొమాంటిక్ ఎంటర్టైనర్ ’18 పేజెస్’ చేస్తున్నారు.
ఇవి కాకుండా తన కెరీర్లో భిన్నమైన చిత్రంగా నిలిచిన ‘స్వామిరారా’కు సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇవి మూడు కాకుండా ఒక స్పై థ్రిల్లర్ చేయనున్నాడు నిఖిల్. ఆసియన్ సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇది కూడ పెద్ద బడ్జెట్ సినిమానే. ఈ సినిమాలను బ్యాక్ టూ బ్యాక్ చేయనున్నాడు. ఇక లాక్ డౌన్ సమయంలో కూడ నిఖిల్ చాలామంది కరోనా బాధితులకు మందులు, ఆక్సిజన్ సిలిండర్లు, ఇతర అవసరాలు తీర్చడంలో విశేషంగా కృషి చేసి మంచి మనసు చాటుకున్నారు.