Nidhhi Agerwal : టాప్ గేర్‌లోకి దూసుకొచ్చిన నిధి అగర్వాల్.?

Nidhhi Agerwal : ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా రూపంలో సూపర్ హిట్ వచ్చినా, సొట్ట బుగ్గల సుందరి నిధి అగర్వాల్ తెలుగులో సరైన బ్రేక్ తెచ్చుకోలేకపోయింది. కానీ, ‘హీరో’ సినిమా ఆమె స్థాయిని పెంచేసింది. ‘హీరో’ సినిమా సక్సెస్ స్థాయి ఎంత.? అన్న విషయాన్ని పక్కన పెడితే, ఈ సినిమా నిధి అగర్వాల్‌కి బాగా కలిసొచ్చింది.. ఆమె పేరు బాగా ప్రొజెక్ట్ అయ్యేలా చేసింది.

మహేష్ మేనల్లుడు గల్లా అశోక్ నటించిన ‘హీరో’ సినిమా సంక్రాంతి పండక్కి విడుదలైంది. సినిమా ‘సోసో’గా వుందనే చర్చ జరుగుతుండగా, సినిమా ప్రమోషన్ల కోసం నిధి పడ్డ కష్టం మాత్రం వృధా కాలేదు. ఆమె రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్ అయిపోయిందన్న చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది.

నిధి ప్రస్తుతం తెలుగులో ‘హరిహర వీరమల్లు’ సినిమాలో నటిస్తోన్న విషయం విదితమే. పవన్ కళ్యాణ్ సినిమా కదా.. నిధి అగర్వాల్ రేంజ్ మరింత పెరగబోతోంది. నిధి అగర్వాల్ మంచి డాన్సర్.. మంచి నటి కూడా. అందం ప్లస్ అభినయం.. అది కొందరికే సాధ్యమవుతుంది. ఆ లీగ్‌లో నిధి అగర్వాల్ పేరు ముందు వరసలోకి వెళుతోందిప్పుడు.

‘హీరో’ తర్వాత రెమ్యునరేషన్ పెంచేశారట కదా.? అన్న ప్రశ్న నిధి అగర్వాల్‌కి ఎదురవుతోంటే, ఆమె ముసి ముసి నవ్వులు నవ్వేస్తోంది. ఇదిలా వుంటే, ఇద్దరు యంగ్ స్టార్ హీరోల సరసన నిధి అగర్వాల్ ఛాన్స్ కొట్టేసిందట. ఆ ప్రాజెక్టుల వివరాలు అతి త్వరలో వెల్లడి కానున్నాయి.