సినీ పరిశ్రమకు ఏదైనా పెద్ద సమస్య వస్తే రాజకీయ ప్రముఖుల వద్దకు వెళ్లడం తరచూ జరిగేదే. ఈమధ్య కూడ కోవిడ్ లాక్ డౌన్ సమస్యల కారణంగా ఇండస్ట్రీ పెద్దలు చిరంజీవి, నాగార్జున, ఇంకొందరు కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవగా ఏపీ సీఎం జగన్ వద్దకు చిరు వెళ్లి చర్చలు జరిపి వచ్చారు. అలా ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నప్పుడు ఇలాంటి సమావేశాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కూడ అలాంటి సిట్యుయేషనే ఒకటి వచ్చింది. ఏపీ ప్రభుత్వం స్పెషల్ షోలను క్యాన్సిల్ చేసింది. టికెట్ ధరలను తగ్గించింది.
ఇది పెద్ద సినిమాలకు భారీ దెబ్బ అనే అనాలి. ఈ టికెట్ ధరలతో డిస్ట్రిబ్యూటర్లు నట్టేట మునిగిపోతాం అంటున్నారు. హక్కులు కొనిపెట్టుకున్న సినిమాలను రిలీజ్ చేయడానికి ఒప్పుకోవట్లేదు. థియేటర్ల ఓనర్లు కూడ అదే మాట అంటున్నారు. 5, 10, 15 రూపాయలతో సినిమా హాళ్లు నడపలేమని అంటున్నారు. ఈ నిబంధనలు పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమా నుండే మొదలయ్యాయి. దీంతో పవన్ అభిమానులు ప్రభుత్వం మీద తీవ్ర అసహనంతో ఉన్నారు. ఇక పెద్ద, మధ్యతరహా సినిమాలన్నీ వాయిదాలు పడుతున్నాయి. ఈ సమస్యను వెంటనే పరిష్కరించుకోవాలని సినీ పెద్దలు చర్చలు జరుపుతూ సీఎం వద్దకు లేదా సంబంధిత మంత్రి వద్దకు వెళ్లాలని భావిస్తున్నారట.
అయితే ఈసారి సమావేశం కోసం అంటూ వస్తే పవన్ కళ్యాణ్ కూడ రావాల్సిందేనని పైనుండి హింట్స్ వెళ్లినట్టు ఫిల్మ్ నగర్ టాక్. సమావేశంలో పవన్ కూడ కూర్చుని ఏం కావాలో అడగాలని, తమతో చర్చించాలని పరోక్షంగా సంకేతాలు పంపుతున్నారని చెప్పుకుంటున్నారు. మరి ఇది నిజమా కాదా.. ఒకవేళ నిజమే అయితే పవన్ వెళ్తారా లేదా అనేది చూడాలి.