నీట్ పరీక్ష విషయమై ఎప్పటికప్పుడు సరికొత్తగా వివాదాలు తెరపైకి వస్తూనే వుంటాయి. ఓ పక్క నీట్ పరీక్షకు సంబంధించి ట్యాంపరింగ్ ఆరోపణలు వస్తోంటే, ఇంకోపక్క నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థినీ, విద్యార్థుల పట్ల నిర్వాహకులు అత్యంత అభ్యంతకర రీతిలో వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు వినిపిస్తున్నాయి.
తాజాగా కేరళలో ఓ నీట్ పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థినులకు జుగుప్సాకరమైన పరిస్థితులు ఎదురయ్యాయి. లోదుస్తులు తొలగించి, పరీక్షా కేంద్రంలోకి వెళ్ళాల్సిందిగా ఆ పరీక్షా కేంద్రం నిర్వాహకులు అల్టిమేటం జారీ చేయడంతో, సిగ్గుతో బిక్కచచ్చిపోయారు విద్యార్థినులు. ఆ తర్వాత చేసేది లేక, వాళ్ళు చెప్పినట్లే విని.. లోదుస్తులు తొలగించి, పరీక్షా కేంద్రంలోకి ఆ విద్యార్థినులు వెళ్ళారట.
జరిగిన అవమానంపై సదరు విద్యార్థిని ఫిర్యాదు చేసింది. మీడియా ముందు ఆవేదన వెల్లగక్కింది. పరీక్షా కేంద్రం నుంచి బయటకు వచ్చే సమయంలో లోదుస్తుల్ని తీసుకుని, అవి అక్కడే ధరించాలనుకున్నా.. వీలు కాదని నిర్వాహకులు తెగేసి చెప్పడంతో మరింత అవమానభారానికి గురయ్యింది బాధిత విద్యార్థిని.
తనతోపాటు చాలామంది విద్యార్థినులు ఇదే సమస్యను ఎదుర్కొన్నట్లు బాధిత విద్యార్థిని మీడియా ముందు చెప్పింది. అయితే, ఆ తనిఖీ ప్రక్రియతో తమకు సంబంధం లేదని, కళాశాల యాజమాన్యం బుకాయించడం గమనార్హం.
నీట్ పరీక్ష సందర్భంగా ముందస్తుగానే నిబంధనలు తెలియజేస్తామనీ, అయినా ఇలాంటి ప్రవర్తన సహించేది లేదని నీట్ పరీక్షను నిర్వహిస్తోన్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. జరిగిన ఘటనపై విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎన్‌టీఏ స్పష్టం చేసింది.
