Bigg Boss : లైసెన్సుడు వ్యభిచారంగా బిగ్ బాస్ రియాల్టీ షోని ‘ఎర్రన్న’.. అదేనండీ సీపీఐ నేత నారాయణ వ్యాఖ్యానించారు. అస్సలాయనకు బిగ్ బాస్ అంటే గిట్టదు. ఆ విషయాన్ని ఆయన పలు సందర్భాల్లో స్పష్టంగా చెప్పారు కూడా. ‘నాకు నాగార్జున అంటే అయిష్టం కాదు, అసహ్యం..’ అంటూ ఈ మధ్యనే ఓ ఇంటర్వ్యూలో సెలవిచ్చారు కూడా.
అయితే, నారాయణకు నచ్చదు కాబట్టి, ‘బిగ్ బాస్’ ఆపెయ్యరు కదా.? అది ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులర్ అయిన రియాల్టీ షో. విదేశాల్లోంచి మన దేశంలోకి వచ్చింది.. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ.. ఇలా పలు భాషల్లో బిగ్ బాస్ రియాల్టీ షో నడుస్తోంది.. సీజన్ల మీద సీజన్లతో సత్తా చాటుతోంది.
సరే, బిగ్ బాస్ రియాల్టీ షోలో కంటెస్టెంట్ల వెకిలి వేషాలు.. ఆ వెలికితనాన్ని డిజైన్ చేసే నిర్వాహకుల పైత్యం.. అదంతా వేరే చర్చ. మరీ, ‘వ్యభిచార కూపం’ అనే స్థాయికి ఈ రియాల్టీ షో గురించి అభివర్ణించడం అత్యంత అభ్యంతకరరం. ఎందుకంటే బిగ్ బాస్ రియాల్టీ షోలో సెలబ్రిటీలుంటారు.. వారి మనోభావాలు, వారి అభిమానుల మనోభావాలూ దెబ్బ తింటాయ్ కదా.
సామాజిక సేవా కార్యక్రమాల్లో పేరు తెచ్చుకున్న సెలబ్రిటీలూ బిగ్ బాస్ రియాల్టీ షోలో మనకు కనిపిస్తారు. బోల్డంత వినోదం ఈ రియాల్టీ షో ద్వారా వీక్షకులకు దక్కుతోంది. అభ్యంతకర కంటెంటు మీద పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు.. కోర్టులకెక్కి, తమ వాదనలు వినిపించొచ్చు. అంతేగానీ, అభ్యంతకర, జుగుప్సాకరమైన ఆరోపణలు చేయడం నారాయణ లాంటి సీనియర్ పొలిటీషియన్లకు తగదు.