Nara Lokesh: మాజీ మంత్రి నారా లోకేష్, వైఎస్ జగన్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. విజయనగరం మహారాజా ఆసుపత్రిలో సాంకేతిక సమస్య కారణంగా ఆక్సిజన్ సరఫరాలో ఇబ్బంది తలెత్తిన విషయం విదితమే. ఈ ఘటనలో ఆక్సిజన్ అందక ఐదుగురు కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే, ఆక్సిజన్ సమస్యతో ఎవరూ చనిపోలేదనీ, వెంటనే సాంకేతిక సమస్యను సరిదిద్దేందుకు ప్రయత్నించామని ఆసుపత్రి వర్గాలు అంటున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయమై తక్షణమే స్పందించిది. అధికారులు, మంత్రులు హుటాహుటిన ఆసుపత్రిలో చోటు చేసుకున్న పరిణామాలపై స్పందించి, తగిన చర్యలు చేపట్టారు. ఆక్సిజన్ అవసరమైనవారికి ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేశారు. వేరే ఆసుపత్రులకు రోగులను తరలించారు. ఇంకోపక్క, ఆక్సిజన్ సమస్యను పరిష్కరించారు. అయితే, ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోవడం బాధాకరమనీ, ఇవి ప్రభుత్వ హత్యలేనని టీడీపీ విమర్శిస్తోంది.
మాజీ మంత్రి, ఎమ్మల్సీ నారా లోకేష్.. విజయనగరం ఆసుపత్రిలో మరణాల్ని ప్రభుత్వ హత్యలుగా అభివర్ణించడం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. ఆక్సిజన్ సమస్య దేశంలోని చాలా రాష్ట్రాల్లో వుందనీ, విజయనగరం ఆసుపత్రి ఘటనలో ఆక్సిజన్ సమస్య తలెత్తిన మాట వాస్తవమే అయినా, ఆక్సిజన్ అందక ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని అధికార పార్టీ చెబుతోంది.
నారా లోకేష్ సహా టీడీపీ నేతలు శవ రాజకీయాలు చేస్తున్నారన్నది అధికార వైసీపీ ఆరోపణ. చంద్రబాబు హయాంలో ఆయన సొంత పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తే, ఈ క్రమంలో పుష్కరాల్లో పలువురు సామాన్యులు ప్రాణాలు కోల్పయారనీ, వాటిని ప్రభుత్వ హత్యలంటారని వైసీపీ ఎదురుదాడికి దిగింది. ఈ సమయంలో ప్రతిపక్షం రాజకీయ ఆరోపణలు చేయడం సబబుగా లేదు.
అదే సమయంలో అధికార పార్టీ ఎదురుదాడి చేయడమూ సబబుగా లేదు. రాష్ట్రంలో కరోనా బాధితులు వైద్యం కోసం అగచాట్లు పడుతున్న మాట వాస్తవం. ఆక్సిజన్ కోసం నానా పాట్లూ పడుతన్న మాట వాస్తవం. ప్రభుత్వం ఆ సమస్యను పరిష్కరించడం మీద శ్రద్ధ పెడితే మంచిది.. విపక్షాలపై ఎదురుదాడి చేయడం కన్నా.