ట్విట్టర్ పిట్టగా పేరుగాంచిన నారా లోకేశ్ ఇన్ని రోజులైన రాజకీయ ప్రపంచంలో స్వేచ్చగా ఎదగలేక పోతున్నాడనే బాధ ఇప్పటికి టీడీపీ పార్టీ అధినేత అయిన చంద్రబాబు మనసును రంపంలా కోస్తూనే ఉందట.. ఏదో ఒకరోజు తన కుమారుడు రాజకీయ పగ్గాలను పట్టి టీడీపీ రధాన్ని ఒంటి చేతితో నడపగా ఆ దృశ్యాన్ని చూసి మురిసిపోవాలని బాబు మనస్సు తెగ ఆరాటపడుతున్నా బలవంతంగా అణుచు కుంటున్నాడట.. ఇంకా రాజకీయాల్లో పెద్దమనిషి అని అనిపించుకోని లోకేశ్ అప్పుడప్పుడు చేసే పిల్ల చేష్టలు టీపీ నాయకులకు చికాకు తెప్పిస్తున్న సందర్భాలు కూడా లేకపోలేదు..
ఇలా అప్‌డేట్ అవకుండా ఏంటి చాక్లెట్ బాయ్ రాజకీయాలు అని మనస్సులో అనుకునే వారు కూడా లేకపోలేదు.. కానీ ఇప్పుడు నారా లోకేశ్‌లో ఎంతో మార్పు వచ్చిందంటున్నారట.. ఇతను చేసిన పనిని చూసిన వారు.. కాగా తనను రాజకీయంగా అసమర్ధుడు అంటూ పదేపదే విపక్షాలు, స్వపక్షం నేతలు చేస్తున్న విమర్శలను లోకేష్ సీరియస్ గానే తీసుకున్నట్టుగా కనిపిస్తున్నారు. అందుకే పార్టీలో తానేంటో నిరూపించుకునే క్రమంలో టీడీపీ నాయకులకే ఆర్డర్స్ పాస్ చేశారట..
తాజాగా హైదరాబాద్ నుంచి అమరావతి లో అడుగుపెట్టిన లోకేష్ పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ, చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదట.. ఇక గతకొద్ది రోజుల క్రితం పార్టీ అనుబంధ విభాగమైన తెలుగు మహిళా కార్యవర్గాన్ని చంద్రబాబు నియమించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వారితో భేటీ అయిన లోకేష్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారట. అదేమంటే పార్టీ కోసం పని చేయకుండా దర్పం ప్రదర్శించడానికి తూతూ మంత్రంగా పదవులను అనుభవించే నాయకుల విషయంలో ఏ మాత్రం ఉపేక్షించబోమని, సవ్యంగా పని చేయకపోతే పదవులు ఊడపీకుతామ్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారట.
దీంతో ఆ సమావేశంలో పాల్గొన్న నాయకులు అంతా ఆశ్చర్యపోయారట. ఇక ఈ విషయం తెలిసిన చంద్రబాబు కూడా ఉలిక్కిపడ్డాడట.. వెంటనే తన మాటలు ఎక్కడ పార్టీని అల్లకల్లోలం చేస్తాయో అని భావించి పార్టీ కోసం సక్రమంగా పని చేసిన వారిని పార్టీ ఎప్పుడూ గుర్తు పెట్టుకుని, అధికారంలోకి వచ్చిన తర్వాత మరింతగా ప్రాధాన్యం ఇస్తామని, అలాగే ఎమ్మెల్యే టికెట్లు సైతం ఇస్తామని లోకేష్ బుజ్జగించడంతో ఆ సమావేశంలో పాల్గొన్న వారంతా ఊపిరి పీల్చుకున్నారట.. ఏంటో ఈ లోకేశం ఏ లోకంలో ఉండి మాట్లాడుతాడో అర్ధం కాడని ఈ విషయం తెలిసిన వారు అనుకుంటున్నారట..