Nani Vs Nani : సినీ నటుడు నానికీ, మంత్రి పేర్ని నానికీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. నిజానికి, సినీ నటుడు నాని, ఎక్కడా పేర్ని నాని ప్రస్తావన తీసుకురాలేదుగానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టిక్కెట్ ధరల్ని తగ్గించడంపై మాత్రం కామెంట్ చేశాడు. ఈ కామెంట్లపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మంత్రులు, ఇతర నేతలూ స్పందించక తప్పదు కదా.
బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్.. ఇలా పలువురు మంత్రులు స్పందించారు సినీ నటుడు నాని వ్యాఖ్యలపై తాజాగా, మరోమారు పేర్ని నాని, సినీ నటుడు నానిపై కౌంటర్ ఎటాక్ చేశారు.
‘ఏ థియేటర్ దగ్గరున్న కిరాణా దుకాణంలో, సినిమా టిక్కెట్ కౌంటర్ కంటే ఎక్కువ అమ్మకం జరుగుతుందో సినీ నటుడు నాని చెప్పాలి. బహుశా నాని దగ్గర ఖచ్చితమైన సమాచారమే వుండి వుంటుంది..’ అంటూ సెటైరేశారు మంత్రి నాని.
అయితే, మంత్రి నాని వ్యాఖ్యలపై సినీ నటుడు నాని స్పందించే అవకాశం లేదు. ఎందుకంటే, ఇకపై ఎవరూ సినీ పరిశ్రమ తరఫున మాట్లాడొద్దంటూ ప్రముఖ నిర్మాత దిల్ రాజు హుకూం జారీ చేశారు గనుక.
అన్నట్టు, మరో సినీ నటుడు సిద్ధార్ధ మీద కూడా పేర్ని నాని సెటైర్లు వేశారు. తమిళనాడు రాష్ట్రం మీదనో, కేంద్ర ప్రభుత్వం మీదనో సిద్దార్ధ సెటైర్ల వేసి వుండొచ్చన్నారు నాని.. రాజకీయ నాయకులు ప్రజలు కట్టే పన్నులతో లగ్జరీ జీవితాలు గడుపుతున్నారంటూ సిద్దార్ధ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.
ఈ వివాదం ఎక్కడిదాకా వెళుతుందోగానీ, సినిమా థియేటర్లు మూతపడ్డంతో వాటినే నమ్ముకున్న చాలా కుటుంబాలు రోడ్డున పడిపోతున్నాయి.