Nandamuri Balakrishna : బాలయ్యా.. ఇంతకీ ఏం చెప్పావయ్యా.?

Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ ఏదో చెప్పారు. ఆయన ఏం చెప్పారో మాత్రం ఎవరికీ అర్థం కాలేదు. ‘నాకంటూ ఓ అభిప్రాయం లేదు..’ అంటారు, పరిశ్రమ కోసం అందరూ కలిసికట్టుగా పని చేయాలంటారు. ఇక్కడ ఎవరు కలిసికట్టుగా పని చేయాలి.? అలా కలిసికట్టుగా పని చేయడం కోసం పరిశ్రమ ప్రముఖులుగా బాలకృష్ణ లాంటోళ్ళు తీసుకుంటున్న చర్యలేంటి.?

తెలుగు సినీ పరిశ్రమలో టిక్కెట్ల రగడ తారాస్థాయికి చేరింది. కరోనా నేపథ్యంలో పరిశ్రమ నష్టాల్లో కూరుకుపోయింది. దాంతో, తెలుగు సినీ పరిశ్రమకు ఊరటనిచ్చేలా, సినిమా టిక్కెట్ల ధరల పెంపుకు అనుమతిచ్చింది తెలంగాణ ప్రభుత్వం. మరోపక్క, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. కరోనాతో కష్టాలు పడుతున్న సాధారణ ప్రజలకు సినిమా టిక్కెట్ల దోపిడీ మరో సమస్యగా మారిందంటూ అక్కడ సినిమా టిక్కెట్ల ధరల్ని తగ్గించేశారు.

తనిఖీల పేరిట థియేటర్లను సీజ్ చేస్తున్న వైనం ఏపీలో కనిపిస్తోంది. ఈ సమస్యలపై పరిశ్రమ ప్రముఖులు కొందరు స్పందించారు. కానీ, స్పందించాల్సినవారి లిస్ట్ చాలా చాలా పెద్దదిగా వుంది. నందమూరి బాలకృష్ణ మొన్న ఏదో అన్నారు.. అదేనండీ, ‘అఖండ’ సినిమా విడుదల తర్వాత విజయవాడ వెళ్ళిన సందర్భంలో. ఆ తర్వాత మళ్ళీ సౌండ్ లేదు.

చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్.. ఈ నలుగురూ ఒక్క చోట కూర్చుని మాట్లాడుకోవచ్చు. పవన్ కళ్యాణ్, మహేష్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీయార్, ప్రభాస్ లాంటోళ్ళను కూడా ఆహ్వానించొచ్చు. నిర్మాతలు, దర్శకుల్ని కూడా ఈ చర్చల్లో భాగస్వాముల్ని చేయొచ్చు. అలా అందరూ ఓ వేదికపై కూర్చుని చర్చించుకుని, సమస్యకు పరిష్కారం వెతకాలి.

అన్నిటికీ మించి, సమస్యపై మాట్లాడేందుకే చాలాంది భయపడుతున్నారు. బాలయ్య కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. పైగా, ఆయన ఎమ్మెల్యే.. ఏపీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.. ప్రతిపక్షంలో వున్నారు. ఆయనా గట్టిగా మాట్లాడరేం.?