Nagababu: సినీ నటుడు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ఇటీవల ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఇలా ఖాళీగా ఉన్నటువంటి 5 ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇటీవల మూడు పార్టీల నుంచి అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయడంతో ఈ ఐదుగురు కూడా ఏకగ్రీవంగా ఎంపిక అయ్యారు. జనసేన పార్టీ నుంచి నాగబాబు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏకగ్రీవం అయ్యారు.
ఈ క్రమంలోనే తనకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈయన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు. ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేందుకు తనకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా అభినందనలు తెలిపారు.
ప్రభుత్వ పరిపాలనలో ప్రజా సేవ చేసేందుకు గాను, ఎమ్మెల్సీగా పోటీ చేసి ఎన్నికయ్యే అవకాశం కల్పించి నా బాధ్యతను పెంచిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలిపారు. తనతో పాటుగా ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కావలి గ్రీష్మ ప్రసాద్, సోము వీర్రాజు, బి. తిరుమల నాయుడు, రవిచంద్ర బీదకు శుభాకాంక్షలు తెలిపారు.
ఇన్ని సంవత్సరాలు పాటు నా రాజకీయ ప్రయాణంలో నాకు సహకరించినటువంటి మిత్రులకు అనుచరులకు జనసేన కార్యకర్తలకు, మీడియా వారికి కూడా నాగబాబు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.నామినేషన్ దాఖలు సందర్భంగా నాతో వెన్నంటి ఉన్న రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, నారా లోకేష్, బీజేపీ శాసనపక్ష నేత పి.విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణకి ప్రత్యేకమైన అభినందనలు అంటూ పేరు పేరునా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
