‘మా’ ఎన్నికలు: నాగబాబుకి బరాబర్ మద్దతిస్తాం: ప్రకాష్ రాజ్

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి ప్రకాష్ రాజ్ ప్యానెల్‌కి పూర్తిస్థాయిలో మద్దతిస్తున్నట్లు సినీ నటుడు, నిర్మాత, మెగా బ్రదర్ నాగబాబు స్పష్టం చేశారు. ‘మా’ ఎన్నికల వ్యవహారం తెరపైకొచ్చిన కొత్తల్లో ప్రకాష్ రాజ్‌కి నాగబాబు మద్దతు తెలిపినా, ఆ తర్వాత ఆయన గాయబ్ అయిపోయిన విషయం విదితమే.

ప్రకాష్ రాజ్‌కి దూరంగా వుండాలని మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు నాగబాబుని వారించారనీ, అందుకే ‘మా’ ఎన్నికల్లో మళ్ళీ నాగబాబు నేరుగా జోక్యం చేసుకోలేదనీ ప్రచారం జరిగింది. తాజాగా నాగబాబు, ‘మా’ ఎన్నికల్ని ఉద్దేశించి మాట్లాడారు.

‘ఆయన ప్రతిసారీ ప్రెస్‌మీట్లు ఎందుకు పెడుతున్నారో నాకు అర్థం కావడంలేదు. ఈ ఎన్నికలతో రాష్ట్ర ప్రజలకు ఉపయోగమేమీ లేదు. ఇది అసోసియేషన్ సభ్యులు తేల్చాల్సిన ఎన్నికల వ్యవహారం. సభ్యులకు ఏం చేస్తారో పోటీ చేసేవాళ్ళు చెప్పాలి..’ అంటూ సీనియర్ నటుడు నరేష్‌ని ఉద్దేశించి నాగబాబు సెటైర్లు వేశారు.

‘జాతీయ స్థాయిలో నటుడిగా తనదైన గుర్తింపు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్‌ని ఓ కన్నడిగుడిగా చూడటం దురదృష్టకరం. ఆయన దేశం గర్వించదగ్గ అతి కొద్ది మంది నటుల్లో ఒకరు.. ప్రకాష్ రాజ్, చిరంజీవికి అత్యంత సన్నిహితుడు. మన అసోసియేషన్‌కి మేలు చేయడానికి వచ్చాడు. ఆయనకీ బీజేపీకి మధ్య రాజకీయ వైరం వుంటే.. అది వేరే చర్చ. ఈ ఎన్నికలకీ రాజకీయాలకీ ఏంటి సంబంధం.?’ అని నాగబాబు ప్రశ్నించారు.

కాగా, ప్రకాష్ రాజ్‌ని వైరస్‌తో పోల్చాడు మరో నటుడు సీవీఎల్ నరసింహారావు. ఆయన కూడా ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష పీఠంపై కన్నేసి, చివరి నిమిషంలో వెనక్కి తగ్గిన విషయం విదితమే. ప్రధాని మోడీని విమర్శించాడు, దేవుడి పట్ల నమ్మకం లేదు.. అంటూ ప్రకాష్ రాజ్ మీద మండిపడ్డారు సీవీఎల్.
ఏదిఏమైనా, ‘మా’ ఎన్నికలంటే జాతీయ స్థాయి ఎన్నికలన్నట్టుగా రాజకీయ రచ్చ జరుగుతోంది సినీ పరిశ్రమలో. ఇంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.