జనసేన నేత, మెగా బ్రదర్ నాగబాబు రాజకీయాల్లోకి ప్రవెశించినప్పటి నుండి తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పేస్తున్నారు. అంతేకాదు అనేక విషయాల మీద భిన్నమైన రీతిలో తన ఐడియాలజీజని బయటపెట్టుకుంటున్నారు. ఈమధ్య కూడా గాంధీని హత్య చేసిన గాడ్సే పట్ల సానుభూతి తెలిపారు నాగబాబు. అది కాస్త పెద్ద స్థాయిలో వివాదమైంది. అంతేకాదు తన అన్న చిరంజీవి సినీ పరిశ్రమ సమస్యల కోసం రాజకీయ నాయకులను కలిస్తే బాలయ్య దాన్ని రియల్ ఎస్టేట్ మీటింగ్ అనడంతో నాగబాబు చెలరేగిపొయారు. అనవసరంగా అన్నయ్యను అంటే ఊరుకునేది లేదని, బాలయ్య తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ రెండే కాదు అనేక విషయాల్లో అపోజిషన్ వారిని ఎకిపారేసిన నాగబాబు కొన్నిరోజులు మౌనంగానే ఉండి తాజాగా తన ట్వీట్లకు పదును పెట్టారు. ఈసారి ఆయన టార్గెట్ చేసింది రాజకీయ నాయకులను, ప్రత్యర్థులను కాదు. నేరుగా ప్రజలనే. ఈమధ్య ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు జనంలో కొందరికి నచ్చడం లేదు. కరోనాపై పోరులో కూడా ప్రభుత్వం తీరు సరిగాలేదని, సరైన సమయంలో ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శలు చేస్తున్నారు. వీటిపై స్పందించిన నాగబాబు రాష్ట్రంలో అభివృద్ది లేదు, కష్టం వస్తే ప్రభుత్వం పట్టించుకోవడంలేదు, అవినీతిలో ప్రభుత్వం కూరుకుపోయింది అంటూ విమర్శించే హక్కు రూ. 2000 తీసుకుని ఓటు వేసిన నీకు లేదు అన్నారు.
కష్ట సమయంలో నేతలు దాక్కున్నారని అంటున్నావ్ మరి ఓటు వేసేటప్పుడు వెయ్యకుండా ఎక్కడ దాక్కున్నావ్, ఓటు వేయని వారికి ప్రశ్నించే హక్కు లేదు అంటూ గత ఎన్నికల్లో ఓటు వేయని ఓటర్లను ఉద్దేశించి చురకలు విసిరారు. ఇక నాగబాబు మాటలకు కొందరు పాజిటివ్ రియాక్షన్ ఇవ్వగా కొందరు నాగబాబుకు కౌంటర్లు వేశారు. వాటికి కూడా తనదైన స్టైల్లో సమాధానమిచ్చిన నాగబాబు నువ్వు చేసిన తప్పును నీకు గుర్తుచేస్తే ఉలిక్కిపడి భుజాలు తడుముకుంటాన్నావే.. గుమ్మడికాయల దొంగ అంటూ చురకలు వేశారు. నాగబాబు 2000 అంటూ అనడం చూస్తే గత ఎన్నికల సమయంలో రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లు ఒక్కొక్కరికి 2000 ఇచ్చారనే ఆనాటి ఆరోపణలు గుర్తుకొస్తున్నాయి.