బాలీవుడ్ విలక్షణ నటుడు ఆమిర్ ఖాన్ ప్రస్తుతం ఆస్కార్ అవార్డుకు ఎంపికైన హాలీవుడ్ చిత్రం ‘ఫారెస్ట్ గంప్’ సినిమా ఆధారంగా ‘లాల్ సింగ్ ఛద్దా’ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హాలీవుడ్ నటుడు టామ్ హంక్స్ నటించిన పాత్రను అమీర్ ఖాన్ చేస్తున్నారు. ఇందులో ఆమిర్ ఖాన్ స్నేహితుడి పాత్ర కోసం మొదట విజయ్ సేతుపతి అనుకున్నారు. చర్చలు ముగియడం సేతుపతి సినిమాకు సైన్ చేయడం జరిగిపోయాయి. కానీ డేట్స్ కుదరకపోవడంతో ఆయన సినిమా నుండి తప్పుకున్నారు.
ఇప్పుడు ఆ అవకాశం నాగచైతన్యకు వచ్చినట్టు తెలుస్తోంది. మే నుండి ఆయన షూటింగ్లో పాల్గొననున్నారట. విజయ్ సేతుపతిని తీసుకున్నారు అంటేనే ఆ పాత్రకు ఒకింత వెయిట్ ఉందనే సంగతి చెప్పాల్సిన పనే లేదు. ఇప్పుడు ఆ పాత్రే నాగచైతన్యకు వచ్చింది. మరి ఆ పాత్రలో నటించడం అందునా ఆమిర్ ఖాన్ లాంటి లెజెండరీ నటుడితో కలిసి చేయడం అంటే ఛాలెంజ్ అనే అనాలి. ఇందులో గనుక నాగచైతన్య మంచి పేరు తెచ్చుకుంటే గనుక ఆయనకు బాలీవుడ్ పరిశ్రమలో గేట్లు తెరుచుకున్నట్టే. మరి చైతూ ఈ అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటారో చూడాలి. ఇకపోతే చైతూ తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ సినిమా చేస్తున్నారు