ఇటీవల కాలంలో నాగబాబు తన యూ ట్యూబ్ ఛానెల్ ద్వారా అనేక రకాల విషయాలను షేర్ చేసుకుంటున్నారు. డబ్బు ఈజీగా ఎలా సంపాదించాలి అనే చిట్కాలతో తన కష్టాలను అనుభవాలను జోడించి పలు ఉదాహరణలు బయటపెడుతున్న నాగబాబు పూరి జగన్నాథ్ బద్రి మొదలైన విధానం గురించి కూడా వివరణ ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ దర్శకులు చాలా మంది ఉన్నారు. కానీ అందులో హిట్, ప్లాప్స్ తో సంబంధం లేకుండా జనాలను ఆకర్షించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి దర్శకుల్లో పూరి జగన్నాథ్ ఒకరు. మాస్ డైలాగ్స్ తో ఆయన ఆకట్టుకునే విధానం ఏ విధంగా ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.
నాగబాబు మాట్లాడుతూ.. మొదట పూరి జగన్నాథ్ ఎవరి దగ్గర వర్క్ చేయలేదు. అతను తనకు తానే ఒక ఏకలవ్య శిష్యుడిగా మారాడు. అప్పట్లో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలన్నా కూడా చాలా పోటీ ఉండేది. అవకాశం అంత ఈజీగా దొరికేది కాదు. కె.బాలా చందర్, రామ్ గోపాల్ వర్మ లాంటి వారు కూడా సొంతంగా ఎదిగినవారే. వారు కూడా ఎవరి దగ్గర పని చేయలేదు.
ఇక పూరి జగన్నాథ్ ఎక్కడ షూటింగ్స్ జరిగినా లొకేషన్స్ కి వెళ్ళేవాడు. దర్శకుడు ఏం చేస్తున్నాడు. నటీనటులను ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు. స్క్రిప్ట్ లో ఏం రాసుకున్నాడు. ఏ విధంగా తెరకెక్కిస్తున్నాడు అనే విషయాలను అక్కడే ఉండి అవగాహన చేసుకునే వాడు. సొంతంగా తనకు తానే పని మీద మమకారం పెంచుకొని ఇప్పుడు ఒక స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు.
బద్రి సినిమా అవకాశం ఎలా వచ్చింది అంటే.. పవన్ కళ్యాణ్ కొత్త వాళ్ళతో చేయాలని అనుకున్న సమయంలో పూరి నా కజిన్ ద్వారా పవన్ కళ్యాణ్ ని కలిసి బద్రి కథను అనుకున్నది అనుకున్నట్లుగా చాలా బాగా చెప్పాడు. పవన్ కళ్యాణ్ కి కథ నచ్చడంతో వెంటనే ఒప్పేసుకున్నాడు. ఆ విధంగా పూరి జగన్నాథ్ మొదటి సక్సెస్ అందుకొని వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ విధంగా మనం నమ్ముకున్న పనిలో నిజాయితీగా కష్టపడితే కోట్లు సంపాదించవచ్చని నాగబాబు వివరణ ఇచ్చారు.