Mystery Temple : కాకులు చేరని దేవాలయం ఎక్కడుందో తెలుసా.?

Mystery Temple :  పచ్చని చెట్లూ, చుట్టూ కొండలూ ఆహ్లాదమైన వాతావరణం. పక్షులు హాయిగా విహరించేందుకు వీలుగా వున్న వాతావరణం. దాంతో అన్ని రకాల పక్షులు హాయిగా విహరిస్తుంటాయ్ ఇక్కడ. కానీ, ఇక్కడ కాకులకు మాత్రం నో ఎంట్రీ. ఎంత ప్రయత్నం చేసినా ఒక్క కాకి కూడా ఆ పరిసరాల్లోకి ప్రవేశించలేదట. ఇంత విచిత్రమైన ఆ చోటు ఎక్కడుందో తెలుసా.?

 కర్నూలు జిల్లా యాగంటి పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రం పరిసర ప్రాంతాల్లో ఎంత వెతికినా ఒక్క కాకి కూడా కనిపించదు.   ఓసీ.. ఇదేమైనా విచిత్రమా అనుకుంటున్నారా.? అవును చిత్రమే. ఎందుకంటే, కాకుల్ని ఆకర్షించేలా నిత్యం వేలాది మంది భక్తుల దర్శనార్ధం వారు సమర్పించే తీర్ధ ప్రసాదాలు, భోజనాలు, వారు తిని పారేసే ఎంగిలి ఆకులు.. ఇలా కాకుల్ని విశేషంగా ఆకర్షించే అంశాలు ఇక్కడ చాలా చాలా ఎక్కువ. అయినా కానీ, చుట్టుపక్కల ఎక్కడా ఒక్క కాకి కూడా కనిపించదు.
ముని పుంగవులైన అగస్థ్య మహా ముని శాపం కారణంగా ఈ ప్రాంతంలో కాకులు చొరబడలేవనీ అక్కడి స్థానికులు చెబుతుంటారు. ఈ యాగంటి కొండ దిగగానే అక్కడ బోలెడన్ని కాకుల్ని గుంపులు గుంపులుగా తిరగడాన్ని చూస్తుంటాం. మరి విచిత్రమేగా. అన్నట్లు శైవ క్షేత్రాల్లో విరివిగా చేసే నవగ్రహ పూజలు కూడా ఇక్కడ నిషిద్ధం. ఎందుకంటే శనీశ్వరుని వాహనం కాకి కనుక.
ఇక యాగంటి క్షేత్రాన పరమ శివుడు కూడా ఎంతో ప్రత్యేకం. శివున్ని ఎక్కడయినా లింగరూపంలోనే కొలుస్తుంటాం. కానీ, ఎక్కడా లేని విధంగా పరమ శివుడు విగ్రహ రూపంలో ఇక్కడ సాక్షాత్కరిస్తాడు. ఏక శిలలో కొలువైన ఉమాదేవీ సమేత మహేశ్వరుడిని చూసేందుకు రెండు కళ్లూ చాలవు. గర్భాలయానికి ఎదురుగా భారీ నంది విగ్రహం ఇక్కడ మరో ప్రత్యేకత. యాగంటి బసవన్నగా ఇక్కడి నంది విశేషమైన పూజలందుకుంటోంది.