జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ టీజర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో.. అప్పుడే ఆర్ఆర్ఆర్ సినిమా వివాదాల్లో చిక్కుకుంది. నిజానికి రాజమౌళి వివాదాలకు దూరం. ఆయన సినిమాల్లోనూ వివాదాలు తక్కువ. కానీ.. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఇలాంటి వివాదం వస్తుందని ఆయన ఊహించి ఉండరు.
కొమురం భీమ్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ లుక్ ను విడుదల చేశారు. దానికి సంబంధించిన టీజర్ ను కూడా విడుదల చేశారు. దాంట్లో ఎన్టీఆర్ ముస్లిం టోపీ పెట్టుకొని కనిపించడమే ప్రస్తుతం వివాదానికి కారణం అయింది. దీనిపై ఇప్పటికే కొందరు బీజేపీ నేతలు రాజమౌళికి వార్నింగులు గట్రా ఇచ్చారు. దానిపై రాజమౌళి మాత్రం ఏం స్పందించలేదు.
తాజాగా.. ఇదే అంశంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ స్పందించారు. మామూలుగా కాదు.. తీవ్రస్థాయిలో ఆయన రాజమౌళిపై విరుచుకుపడ్డారు. డైరెక్టర్ రాజమౌళిని ఆయన హెచ్చరించారు.
బిడ్డా… రాజమౌళి.. కొమరం భీమ్ ను కించపరుస్తూ సినిమా తీస్తావా? నీకు గుణపాఠం తప్పదు. మా బిడ్డను కించపరిచేలా ముస్లిం టోపీ పెట్టినవు. నీకు నిజంగా దమ్ముంటే ఓల్డ్ సిటీ ముస్లింకి కాషాయం కండువా వేసి సినిమా తీయ్. నీకు దమ్ముంటే తీయ్.. మేం చూస్తం. నువ్వు గనుక ఆ సినిమా రిలీజ్ చేస్తే బరిగలతో కొట్టి చంపుతం.. జాగ్రత్త.. అటూ దుబ్బాక ప్రచార సమయంలో రాజమౌళిపై బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.