Modi’s Shocking Comments : ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజనపై మోడీ మొసలి కన్నీరు.!

Modi’s Shocking Comments : ‘అమ్మని చంపి, బిడ్డకు తీసినట్టుంది..’ అంటూ ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజనపై అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిప్పులు చెరిగారు, నరేంద్ర మోడీ. మరి, ప్రధాని అయ్యాక నరేంద్ర మోడీ చేసిందేంటి.? ఆనాటి ఆ తప్పుని సరిదిద్దాలి కదా.?

గడచిన ఎనిమిదేళ్ళలో రెండు తెలుగు రాష్ట్రాలకూ నరేంద్ర మోడీ ప్రభుత్వం సమ న్యాయం చేయాల్సింది పోయి, సమ అన్యాయం చేస్తూ వస్తోంది. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయలేని చేతకానితనం నరేంద్ర మోడీ ప్రభుత్వానిది. బుల్లెట్టు రైలు.. ఇంకోటి.. అంటూ పబ్లిసిటీ స్టంట్లు చేయడం తప్ప, పోలవరం ప్రాజెక్టుపై దేశానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏం సమాధానం చెప్పగలుగుతుంది.?

ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదాపైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం కప్పదాటు వైఖరిని అవలంభిస్తూ వస్తోంది. మోసపూరిత విధానంతో ప్రత్యేక హోదా అంశాన్ని అటకెక్కించింది. ‘పార్లమెంటు తలుపులు మూసి, ఎలాంటి చర్చా లేకుండా ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని విభజించారు.. అది సరైన పద్ధతేనా.?’ అంటూ పార్లమెంటులో తాజాగా మోడీ చేసిన వ్యాఖ్యలతో అంతా విస్తుపోతున్నారు.

గడచిన ఎనిమిదేళ్ళుగా పార్లమెంటులో ఏం జరుగుతోందో చూస్తున్నాం. పార్లమెంటులో ఏ అంశం మీద అయినా సరైన చర్చ జరుగుతోందా.? టీడీపీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యుల్ని లాక్కుని, ఇతర రాజకీయ పార్టీలను ప్రలోభపెట్టి.. ఆయా బిల్లుల్ని పాస్ చేయించుకుంటోంది నరేంద్ర మోడీ ప్రభుత్వం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి, పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి, రైల్వే జోన్ ఇచ్చి, తెలంగాణలో అలాగే ఆంధ్రప్రదేశ్‌లో స్టీలు ప్లాంట్లు పెట్టి.. ఇలా విభజన చట్టంలోని అంశాల్ని పూర్తిగా నెరవేర్చాక.. విభజనపై తమ చిత్తశుద్ధి గురించి మాట్లాడాలి తప్ప, ఇలా టైమ్ పాస్ కబుర్లు పార్లమెంటులో చెబితే ఎలా.? అన్న విమర్శ తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల నుంచి నరేంద్ర మోడీపైకి దూసుకెళుతోంది.