మోడీతో మమత ఢీ.. ఎవరి బలమెంత.?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో తలపడబోతున్నారు 2024 ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ. ప్రస్తుతానికైతే ప్రధాని అభ్యర్థి ఎవరన్నదానిపై చర్చ అనవసరం అని తేల్చేసి, అందరూ ఒక్కతాటిపైకొచ్చి ప్రధాని అభ్యర్థిని ఎంచుకుని, నరేంద్ర మోడీ మీద సమైక్య పోరాటం చేయాలని చెబుతున్న మమతా బెనర్జీ, తెరవెనుక ప్రధాన మంత్రి అభ్యర్థిగా తన పేరుని ఆయా పార్టీల చెవిన వేసేస్తున్నారు. త్వరలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతీయ పార్టీలతో, మరీ ముఖ్యంగా అధికారంలో వున్న ప్రాంతీయ పార్టీలతో మమతా బెనర్జీ అధికారిక భేటీలు నిర్వహించబోతున్నారట. నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రాల హక్కుల్ని కాలరాస్తోందన్నది మమతా బెనర్జీ ఆరోపణ. ఇదే అభిప్రాయం, దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రల్లో వుంది. అయితే, ఆయా రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు నడుపుతున్నవారి వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీకి వంగి వంగి సలాం చేయక తప్పడంలేదు. ఈ పరిస్థితి మార్చాలన్నది మమతా బెనర్జీ ఆలోచన.

త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ దెబ్బ తింటే, సార్వత్రిక ఎన్నికల నాటికి బీజేపీ మరింత దారుణంగా దెబ్బ తినే అవకాశాలున్నాయి. కానీ, దేశంలో ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా గాలి వీచడం అనేది పెద్దగా కనిపించడంలేదు. ఒకవేళ మోడీని వ్యతిరేకిస్తున్న శక్తులు చాలానే వున్నా, అవన్నీ కలిసి ఒక నాయకత్వాన్ని మోడీకి వ్యతిరేకంగా నిలబటెట్టడం అత్యంత క్లిష్టమైన వ్యవహారం. ఇక, బలాబాల విషయానికొస్తే.. మోడీ, మమతా బెనర్జీ.. ఇద్దరూ ఇద్దరే. రాజకీయ వ్యూహాల విషయంలో ఒకర్ని మించినవారు ఇంకొకరు. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గెలిచినా, ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీని ఓడించగలిగింది బీజేపీ. అదీ మోడీ పవర్. ఆ పవర్‌ని తట్టుకుని నిలబడటం మమతకి అంత ఈజీ కాదు. అదే సమయంలో, తన పీఠం కూల్చేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాల్ని తిప్పికొట్టడంలో సఫలమైన మమతని మరీ అంత తక్కువగా అంచనా వేయలేం కూడా.