Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత యాదాద్రి భువనగిరి జిల్లాలలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈమె కాంగ్రెస్ నాయకులకు అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ ఆఫీసుల పైన అలాగే బిఆర్ఎస్ నాయకులు నేతలపై కూడా దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ దాడుల గురించి కవిత మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు.
బిఆర్ఎస్ పార్టీ అంటే 60 లక్షల మంది సైనికులు ఉన్నటువంటి ఒక పెద్ద కుటుంబం అని తెలిపారు. ఇలాంటి కుటుంబం జోలికి వస్తే కాంగ్రెస్ నాయకులు బయట తిరగలేరు అంటూ ఈమె వార్నింగ్ ఇచ్చారు. ఖబడ్దార్ కాంగ్రెస్ నాయకులు.. జాగ్రత్తగా ఉండండి అంటూ కవిత వారిపైన తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీది దరిద్రపు సంస్కృతి అంటూ కవిత మండి పడ్డారు. ఇలా రౌడి మూకలను వెంటవేసుకొని పార్టీ ఆఫీసులపై దాడి చేసే సంస్కృతి కాంగ్రెస్ పార్టీదని తెలిపారు.
ప్రజల కోసం పోరాటం చేసే సంస్కృతి తమదని, నిబద్దతతో, మాటలతో, విజ్ఞతతో తాము ప్రజల కోసం పోరాటం చేస్తున్నామని వెల్లడించారు. ఇక మూసీ నది ప్రక్షాళన విషయంలో కూడా కాంగ్రెస్ నాయకులను తప్పు పట్టారు. మూసి ప్రక్షాళన అంటూ మూసి నదినీ కాంగ్రెస్ నాయకులు ఒక ఏటీఎంలా వాడుకున్నారని ఈమె మండిపడ్డారు. అసలు మూసీ సుందరీకరణకు కెసిఆర్ సంకల్పం తీసుకున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ నేతలు కాసుల కోసమే మూసి ప్రక్షాళన చేస్తున్నారంటూ మండిపడ్డారు.
ప్రాజెక్టులు మాత్రమే కాదు యాదాద్రిలో కేసీఆర్ మొదలు పెట్టిన పనులను సైతం కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయాలని కవిత డిమాండ్ చేశారు. మూసి ప్రక్షాళన పేరుతో కోట్లాది రూపాయలు దండుకొని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి పంపించాలనే పథకం వేశారు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై కవిత చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి.