Minister Roja : తమిళనాడులో కాకుండా తమిళ సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో షూటింగ్ జరుపుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు సినీ దర్శకుడు సెల్వమణి. సెల్వమణి ఎవరో కాదు, ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆర్కే రోజా భర్త. సినిమా హీరోయిన్‌గా వున్నప్పుడే సెల్వమణిని పెళ్ళాడారు రోజా.
సెల్వమణి, తమిళ సినీ ప్రముఖుడిగా.. పరిశ్రమలో కీలకమైన పదవిలో వున్న వ్యక్తిగా తమిళ సినీ పరిశ్రమ తరఫున వకాల్తా పుచ్చుకోవడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారానికి కారణమవుతోంది. ‘మా రాష్ట్రానికి రండి.. మా రాష్ట్రంలో షూటింగులు చేయండి.. అవసరమైతే స్టూడియోలు నిర్మించుకోండి..’ అంటోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
ఈ మధ్య పలు తమిళ సినిమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షూటింగులు జరుపుకుంటున్నాయి కూడా. సూర్య, అజిత్ లాంటి హీరోలు ఏపీలో తమ సినిమాల షూటింగులు చేస్తున్నారు. రజనీకాంత్ కూడా ఏపీలో షూటింగ్ పట్ల మక్కువ చూపుతున్నారు. అయితే, ప్రధానంగా షూటింగ్ కార్యకలాపాలు తమిళనాడు తర్వాత తెలంగాణలోనే ఎక్కువగా జరుగుతున్నాయి.
ఇతర రాష్ట్రాల్లో షూటింగులు జరగడం వల్ల తమిళనాడు ప్రభుత్వానికి రెవెన్యూ తగ్గుతోందన్నది సెల్వమణి వాదన. తమిళ సినీ ప్రముఖుడిగా ఆయన తన వాదనను బలంగా వినిపించి, తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యారు. అయితే, అది కాస్తా మంత్రి రోజాకి రాజకీయంగా ఇబ్బందులు తెచ్చిపెడుతోంది.
ఈ విషయమై మంత్రి రోజా ఏమంటారో వేచి చూడాల్సిందే.