దుబ్బాక ఉప ఎన్నిక దృష్ట్యా మంత్రి కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్.. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు.. తన దృష్టిలో రేవంత్ రెడ్డి లీడరే కాదన్నారు.
ఒకప్పుడు టీడీపీలో ఉన్నారు… ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు.. రేపు ఏ పార్టీలో ఉంటారో? రేపోమాపో బీజేపీలోకి పోతారు.. అంటూ మంత్రి కేటీఆర్ జోస్యం చెప్పారు.
రేవంత్ రెడ్డిని అసలు ప్రజలు పట్టించుకుంటున్నారా? కాంగ్రెస్ నేతలు కూడా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు. దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీకి మిగిలేది గుండు సున్నా.. అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.
బీజేపీ తీరు సమాజంలో తక్కువ.. సామాజిక మాధ్యమంలో ఎక్కువ
అలాగే బీజేపీ పార్టీపై కూడా మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. బీజేపీది వాట్సప్ యూనివర్సిటీ అంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ పార్టీ సమాజంలో తక్కువ ఉంటూ.. సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా ఉంటోందంటూ మండిపడ్డారు. వాట్సప్ యూనివర్సిటీలు నడుపుతూ ప్రజల్లోకి తప్పుడు సందేశాలను తీసుకెళ్తోందన్నారు.
రాష్ట్రంలో ఏ పని జరిగినా.. తామే ఇస్తున్నామంటూ గప్పాలు కొట్టే బీజేపీ నేతలు.. రఘునందన్ రావు బంధువు ఇంట్లో దొరికిన దానికి మాత్రం తమది కాదంటున్నారు. కానీ.. నగదు ఎక్కడి నుంచి వచ్చిందో అందరికీ తెలుసు.. అందరూ చూశారు అంటూ కేటీఆర్ స్పష్టం చేశారు.