దుబ్బాక ఉపఎన్నిక పోరు మామూలుగా లేదు. దుబ్బాక ఉపఎన్నికలో పార్టీలన్నీ తెగ ఆవేశపడుతున్నాయి. ఒక పార్టీని ఇంకో పార్టీ నిందించుకోవడం.. అసలు.. ఒకే ఒక స్థానం కోసం ఇంతలా పార్టీలన్నీ కొట్టుకోవడం ఏంటో? జనాలకు మాత్రం అస్సలు అర్థం కావడం లేదు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా ఇంత హడావుడి లేదు. పార్టీలు ఇంత హడావుడి చేసింది లేదు. కానీ.. ఒక్క స్థానం కోసం మాత్రం పార్టీలు మాత్రం తెగ ఆరాటపడుతున్నాయి. దుబ్బాక ఉపఎన్నిక గురించి దేశమంతా తెలిసింది. చివరకు హోంమంత్రి అమిత్ షా కూడా ఈ ఎన్నిక గురించి ఆరా తీశారంటే ఈ ఎన్నికను పార్టీలన్నీ ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయో అర్థం అవుతోంది.
అయితే.. ఇటీవల సిద్ధిపేటలో జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బంధువు ఇంట్లో నోట్ల కట్టలను పోలీసులు పట్టుకున్నారని.. అవి బీజేపీ అభ్యర్థి ఓటర్లకు పంచడానికి తీసుకొచ్చినవేనని వార్తలు వచ్చాయి.
అయితే.. బీజేపీ కార్యకర్తలు మాత్రం అవి పోలీసులే తీసుకొచ్చారని చెప్పి.. నోట్లకట్టలను పోలీసుల నుంచి గుంజుకున్నారు. అలాగే బండి సంజయ్ మీద కూడా పోలీసులు దాడి చేసినట్టు బీజేపీ నేతలు చెప్పుకొచ్చారు. ఈ ఘటనలపై బీజేపీ… అధికార టీఆర్ఎస్ పై విరుచుకుపడింది. టీఆర్ఎస్ పార్టీ.. బీజేపీ అభ్యర్థి గెలవకుండా కుట్రలు పన్నుతోందంటూ నిరసన వ్యక్తం చేశారు. బండి సంజయ్ కూడా నిన్న నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఆయనకు మరో ఎంపీ అర్వింద్ కూడా మద్దతు పలికారు.
అయితే.. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా… కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ఎందుకు స్పందించడం లేదు.. టీఆర్ఎస్ పార్టీకి వకాల్తా పుచ్చుకున్నారా? అంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే.
ఈనేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. పోలీసుల తీరు, ప్రభుత్వం తీరుపై ఆయన మండిపడ్డారు. దుబ్బాక ఉపఎన్నికలో రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని… దీనిపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాల అధికారులకు ఫిర్యాదు చేస్తామని కిషన్ రెడ్డి వెల్లడించారు.
సెర్చ్ వారెంట్ లేకుండా.. సివిల్ డ్రెస్సుల్లో పోలీసులు రఘునందన్ రావు బంధువుల ఇళ్లలో ఎలా సోదాలు నిర్వహిస్తారంటూ ప్రశ్నించారు. దీనిపై తనకు వెంటనే నివేదిక ఇవ్వాలని తెలంగాణ డీజీపీని ఆదేశించారు.