బీజేపీ ‘బలాన్ని’ ఒప్పుకునే సమస్యే లేదంటున్న హరీష్‌రావు!

Minister Harish Roa

Minister Harish Roa

దుబ్బాక ఉప ఎన్నికలో గెలిచినంతమాత్రాన.. గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల్లో సత్తా చాటినంతమాత్రాన, తెలంగాణలో బీజేపీ బలపడినట్లు ఒప్పుకునే ప్రసక్తే లేదని అంటున్నారు తెలంగాణ రాష్ట్ర సమితి ముఖ్య నేత, మంత్రి హరీష్ రావు. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ అత్యంత వ్యూహాత్మకంగా పావులు కదుపుతోన్న హరీష్ రావు, బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచే అవకాశమే లేదని కుండబద్దలుగొట్టేస్తున్నారు. బీజేపీ అభ్యర్థులకు ప్రజల్లో నిలదీతలు ఎదురవుతున్నాయనీ, తమ పార్టీ అభ్యర్థులకి జనం బ్రహ్మరథం పడుతున్నారనీ హరీష్ రావు చెప్పుకొచ్చారు. ‘బీజేపీకి నిజంగా అంత బలం వుంటే, అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటుకే ఎందుకు పరిమితమయ్యింది.?’ అని హరీష్ రావు ప్రశ్నిస్తున్నారుగానీ, బీజేపీకి బలం లేకపోతే, లోక్ సభ ఎన్నికల్లో ఎందుకు అనూహ్యంగా బీజేపీ, తెలంగాణ రాష్ట్ర సమితికి షాకిచ్చినట్లు.! హరీష్ రావు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా తెలంగాణలో బీజేపీ బలపడింది, మరింత బలపడుతోంది కూడా.

‘గులాబీ పార్టీ నుంచి కమలం పార్టీలోకి వలసలేమీ వుండవు’ అని ఓ పక్క మంత్రి హరీష్ చెబుతోంటే, ఇంకోపక్క టీఆర్ఎస్ నుంచి ముఖ్య నేతల్ని లాగేందుకు బీజేపీ ఖచ్చితమైన వ్యూహాలతో ముందడుగు వేస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ పార్టీకి పెద్ద షాక్ తగలబోతోందనీ, ఆ తర్వాత తెలంగాణలో టీఆర్ఎస్ మరింత బలహీనపడుతుందనీ, అధికారం కోల్పోతుందనీ కమలం పార్టీ నేతలు జోస్యం చెబుతుండడం గమనార్హం. ఇక, హరీష్ రావు స్వయంగా దుబ్బాక ఉప ఎన్నికల బాధ్యతను తీసుకున్నా, దుబ్బాకలో గులాబీ పార్టీని గెలిపించలేకపోయిన విషయం విదితమే. అప్పటికీ ఇప్పటికీ చాలా తేడాలున్నాయనీ, ఆ ఎన్నికల్ని ఈ ఎన్నికలతో ముడిపెట్టలేమనీ హరీష్ రావు చెబుతున్నా, ఆయన మాటల్లో ఒకప్పటి కాన్ఫిడెన్స్ ఇప్పుడు కనిపించడంలేదన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.