మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. వాటిలో సినిమాల్లో మెహర్ రమేష్ సినిమా కూడ ఒకటి. ఇది తమిళ సూపర్ హిట్ చిత్రం ‘వేదాళం’కు తెలుగు రీమేక్. కొరటాల శివ ‘ఆచార్య’ ఎప్పుడైతే లాక్ అయిందో ఈ సినిమా కూడ అప్పుడే లాక్ అయింది. చిరు నుండి గ్రీన్ సిగ్నల్ తీసుకోవడానికి మెహర్ రమేష్ ఎంతో శ్రమ పడాల్సి వచ్చింది. ఒరిజినల్ కథను తెలుగుకు తగ్గట్టు మార్చడానికి చాలా శ్రమించారు. చిరుతో అనేకసార్లు సమావేశమై ఆయన చెప్పిన ప్రతి మార్పును చేశారు. సినిమా పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడ చిరంజీవికి చాలా దగ్గరయ్యారు. చిరంజీవి నమ్మకం పొందడానికి పలు బాధ్యతలు నిర్వర్తించాడు కూడ.
కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో చిరంజీవి ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ ఛారిటీ బాధ్యతలను దగ్గరుండి చూసుకున్నాడు. విరాళాలు సేకరించడం నుండి నిత్యావసర సరుకుల పంపిణీ వరకు అన్నీ చేశారు. అయినా ఆయన కోరిక తీరట్లేదు. కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న ‘ఆచార్య’ తర్వాత తన సినిమానే ఉంటుందని అనుకున్నాడు మెహర్ రమేష్. కానీ మోహన్ రాజాతో ‘లూసిఫర్’ రీమేక్ పట్టాలెక్కించారు చిరంజీవి. దీంతో ఈ ఏడాది మెహర్ రమేష్ మెగాఫోన్ పట్టడం కుదరదు. సరే ఆ సినిమా తరవాత అయినా తనకి అవకాశం దక్కుతుందని అనుకుంటే అదీ జరిగేలా లేదు. ఎందుకంటే మోహన్ రాజా సినిమా తర్వాత రవీంద్ర బాబీ సినిమా ఉంటుందని భోగట్టా. బాబీ ఇప్పటికే ప్రీప్రొడక్షన్ పనులు వేగవంతం చేశారు. దీంతో మెహర్ రమేష్ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది మధ్యలోకి వెళ్లేలా కనబడుతోంది.