Megastar Chiranjeevi:టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.1978 వ సంవత్సరంలో పునాదిరాళ్లు సినిమా ద్వారా ఇండస్ట్రీలో అడుగు పెట్టి తన స్వయంకృషితో ఎన్నో అవరోధాలను దాటుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోగా పేరు, ప్రఖ్యాతలు గడించాడు. చిరంజీవి తన కెరీర్ ప్రారంభంలో నటుడిగా, మంచి డాన్సర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. తన సినీ ప్రయాణం మొదలు పెట్టిన రెండు సంవత్సరాలకే చిరంజీవి మీద ఉన్న నమ్మకంతో అలనాటి ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య గారు తన కుమార్తె సురేఖ వాణినీ చిరంజీవి గారికి ఇచ్చి వివాహం జరిపించారు.
1980 ఫిబ్రవరి 20వ తేదీన చిరంజీవి-సురేఖవాణి ల వివాహం జరిగింది. ఈ దంపతులిద్దరూ రెండు రోజులలో 42 సంవత్సరాల వైవాహిక జీవితాన్ని పూర్తి చేసుకోనున్నారు. అందువల్ల అలనాటి వీరి పెళ్లి ఫోటో, శుభలేఖ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అయ్యాయి. చిరంజీవి పెళ్లి సమయంలో నూతన్ ప్రసాద్ తో కలిసి “తాతయ్య ప్రేమ లీలలు” అనే సినిమాలో నటిస్తున్నాడు. షూటింగ్ సమయంలో తన చొక్కా చిరిగిపోవడం తో సమయం లేక చిరిగిన చొక్కా తోనే సురేఖ మెడలో చిరంజీవి తాళి కట్టాడని ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి చెప్పుకొచ్చాడు. 42 సంవత్సరాలుగా తమ వైవాహిక జీవితంలో ఎటువంటి మనస్పర్థలకు తావివ్వకుండా ఎంతో ఆనందంగా ఉన్నారు.
అయితే ప్రస్తుతం చిరంజీవి ఆచార్య సినిమాలో నటించాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఎప్పుడో విడుదల కావల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా వేయవలసి వచ్చింది. ప్రస్తుతం గాడ్ ఫాదర్ , బోలా శంకర్ సినిమాల షూటింగ్ మొదలు పెట్టనున్నారు. ఈ వయసులో కూడా ఎంతో ఎనర్జీతో ప్రస్తుత హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్నాడు.