కరోనా వైరస్ వల్ల సినిమా ఇండస్ట్రీ ఎంతలా దెబ్బతిన్నదో అందరికీ తెలుసు. టాలీవుడ్ సినీ పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. షూటింగ్ లు ప్రారంభం అయినప్పటికీ.. థియేటర్లు మాత్రం ఇంకా మూతపడే ఉన్నాయి. దీంతో ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేస్తున్న ఎన్నో సినిమాలు రిలీజ్ కోసం వేచి చూస్తున్నాయి. కొన్ని సినిమాలను ధైర్యం చేసి ఓటీటీల్లో విడుదల చేసినా అంతగా కలిసి రావడం లేదు. థియేటర్లలో ఆ సందడే లేదు. ఎందరో ఆర్టిస్టులు రోడ్డున పడ్డారు. దీంతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలిసి పరిశ్రమను ఆదుకోవడానికి ముందుకురావాలని కోరడానికి సినీ పెద్దలు సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే.. టాలీవుడ్ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున తదితరులు… తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన విషయం తెలిసిందే. టాలీవుడ్ ను ఆదుకోవడానికి కేసీఆర్ కూడా ముందుకు వచ్చారు.
కరోనా వల్ల తెలుగు ఇండస్ట్రీ ఎంత మేరకు నష్టపోయింది.. ఎంత లాస్ లో ఉంది.. అనేదానిపై నివేదిక తయారు చేశారట. ఆ నివేదికను చిరంజీవి.. జగన్ ను కలిసినప్పుడు ఆయనకు ఇవ్వనున్నారట. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సినీ ఇండస్ట్రీకి ఏవైనా రాయితీలు ఇస్తే బాగుంటుందని సినీ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు వైజాగ్ లో సినీ పరిశ్రమను ఎస్టాబ్లిష్ చేయడంపై కూడా జగన్ తో సినీ పెద్దలు చర్చించనున్నారట. ముఖ్యంగా చిరంజీవి చొరవ తీసుకొని సినీ ఇండస్ట్రీని గాడిలో పెట్టడం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. చిరంజీవితో పాటు నాగార్జున కూడా ముందుంటున్నారు. ఇప్పటికే ఓసారి షూటింగ్ అనుమతుల కోసం చిరంజీవితో పాటు ఇతర సినీ పెద్దలు ఏపీ సీఎంను కలిశారు. తాజాగా.. సినీ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలను సీఎంకు విన్నవించి… ప్రభుత్వం నుంచి రాయితీలను కల్పించాలంటూ ముఖ్యమంత్రిని కోరనున్నట్టు తెలుస్తోంది.