మెగాస్టార్ చిరంజీవి, తన అభిమానులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ వార్త ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. వాస్తవానికి చిరంజీవి, తన అభిమానులతో తరచూ సమావేశమవుతుంటారు. అభిమాన సంఘాలకు చెందిన కొందరితో ప్రత్యేకంగా భేటీలు ఏర్పాటు చేసి, సేవా కార్యక్రమాల విషయమై వారికి తగు సూచనలు చేస్తుంటారు. వారి నుంచి సూచనల్ని స్వీకరిస్తుంటారు కూడా.
చిరంజీవి ఐ బ్యాంక్, చిరంజీవి బ్లడ్ బ్యాంక్, చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్.. ఇవన్నీ పైకి కనిపించేవి మాత్రమే. తెరవెనుకాల చిరంజీవి చేసే సేవా కార్యక్రమాల్లో చాలావరకు పబ్లిసిటీకి నోచుకోవు. అభిమానులు ఎక్కడ ఏ మూల ఇబ్బందులు పడుతున్నారని తెలిసినా, చిరంజీవి వారిని ఆదుకుంటుంటారు.
కరోనా నేపథ్యంలో అభిమానులతో సమావేశమవలేకపోయారు గత కొన్నాళ్ళుగా. కాస్త తీరిక చూసుకుని, ఇప్పుడు తాజాగా ప్రత్యేక భేటీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అభిమాన సంఘాలకు చెందిన ముఖ్యులతో ఈ సమావేశాలు విడివిడిగా జరుగుతున్నాయి.
కరోనా నేపథ్యంలో ఆక్సిజన్ కొరత ఏర్పడిందనీ, ఈ క్రమంలోనే ఆక్సిజన్ బ్యాంకుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందనీ, విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ సిలెండర్లను తెప్పించామని చిరంజీవి చెప్పుకొచ్చారు.
కరోనా కారణంగా అభిమానుల్ని కోల్పోవాల్సి రావడం బాధాకరమన్న చిరంజీవి, మరింతగా సేవా కార్యక్రమాల్ని విస్తృతం చేయాల్సిన ఆవశ్యకతను అభిమానులకు గుర్తు చేశారు. కాగా, చిరంజీవి చేతికి బ్యాండేజ్ వుండడం పట్ల అభిమానులు కొంత ఆందోళన చెందారు. చిన్నపాటి గాయం కారణంగా చిరంజీవి చేతికి బ్యాండేజ్ వేయాల్సి వచ్చినట్లు తెలుస్తోంది.
ఇదిలా వుంటే, 2024 ఎన్నికల కోసం చిరంజీవి సమాయత్తమవుతున్నారనీ, అభిమానుల్ని సమాయత్తం చేస్తున్నారనీ, జనసేన పార్టీకి ఈసారి చిరంజీవి అధికారికంగా మద్దతిచ్చే అవకాశాలున్నాయనీ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.