ఒకప్పుడు హీరోలంతా మాస్ ఇమేజ్ కోసం తహతహలాడేవారు. ఒక్క హిట్ పడితే చాలు పెద్ద సినిమాలను, స్టార్ డైరెక్టర్లను వెతుక్కుంటూ వెళ్లేవారు. చిన్నా మధ్యతరహా దర్శకులను అంతగా పట్టించుకినేవారు కాదు. అలా స్టార్ డైరెక్టర్ల వెంటపడి దెబ్బతిన్న హీరోలు చాలామందే ఉన్నారు. వారందరినీ చూసి ఇప్పటి తరం హీరోలు జాగ్రత్తపడుతున్నారు. ముఖ్యంగా మెగా హీరోలు. మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన యువ హీరోలు మూస పద్దతితికి స్వస్థి చెప్పి కెరీర్ నిలబెట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. మాస్ ఇమేజ్ కంటే ముందు హిట్లు కావాలని అంటున్నారు.
ఈ ఏడాది ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఫస్ట్ పిక్చర్ ‘ఉప్పెన’ బ్లాక్ బస్టర్ అయినా నెల మీదనే ఉన్నాడు. మొదటి సినిమా సూపర్ హిట్ కొట్టేశాం ఇక మాస్ హీరో అయిపోవడమే అనే అపోహను పక్కకు పెట్టి రియాలిటీలో ఆలోచిస్తూ కథా బలమున్న సినిమాలనే ఓకే చేసుకుంటున్నాడు. ‘ఉప్పెన’ తర్వాత ఆయనకు చాలానే ఆఫర్లు వచ్ఛాయి. వాటిలో పక్కా కమర్షియల్ కథలూ ఉన్నాయి. కానీ వైష్ణవ్ మాత్రం సక్సెస్ రేట్ బాగుంటే ఎప్పుడూ లైమ్ లైట్లోనే ఉండొచ్చని భావించి మంచి సినిమాలు రెండింటిని మాత్రమే ఓకే చేశారు. మరొక మెగా హీరో వరుణ్ తేజ్ కూడ ఇదే ఫాలో అవుతున్నాడు. వరుస హిట్లు ఉన్నా విపరీత పోకడలకు పోకుండా కొత్త దర్శకులతో, మీడియం రేంజ్ డైరెక్టర్లతో వర్క్ చేస్తున్నాడు. ఆయన చేస్తున్న ‘గని’ చిత్ర దర్శకుడు శశి కిరణ్ కొత్తవాడే. అలాగే ప్రవీణ్ సత్తారుతో తాజాగా ఒక సినిమా ఒక సినిమా ఒప్పుకున్నాడు. ఇలా మెగా హీరోలు నేల మీదే నడుస్తూ జాగ్రత్తగా కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నారు.