ATMలలో దొరకని 2000 నోట్లు.. మొత్తం వాళ్ల దగ్గరే ఉన్నాయట ??

ప్రజలందరిలోనూ ఒకటే అనుమానం.. 2000 రూపాయల నోట్లు ఎమైనట్టు, ఎక్కడా కనిపించట్లేదు.  ఏటీఎంలలో రావట్లేదు, బ్యాంకుల్లో ఇవ్వట్లేదు.. మరి రిజర్వ్ బ్యాంక్ ముద్రించిన 2000 రూపాయల నోట్లన్నీ ఏమైపోయాయి అని.  నిజమే 2000 రూపాయల నోట్లు ఏమయ్యాయో ఎవ్వరికీ తెలియట్లేదు.  ఈమధ్య కేంద్రం 2000 నోట్ల ముద్రణ నిలిపివేసిందని, త్వరలోనే నోట్లు రద్దైపోతాయనే వార్తలు వచ్చాయి.  కానీ 2000 నోట్లను నిలిపివేయడంపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆర్థిక శాఖ సహాయ మంత్రి ప్రకటించారు.  అంటే పెద్ద నోట్ల ముద్రణ ఆగలేదని స్పష్టమైంది.  మరి నోట్లు ప్రింట్ అవుతున్నా బయటి జనానికి ఎందుకు అందుబాటులో లేవనేదే ప్రశ్న. 

పెద్ద నోట్ల మూలంగా నల్లధనం దాచుకోవడం సులభమవుతోంది కాబట్టి పెద్దవైన 1000, 500 నోట్లను రద్దు చేసిన మోదీ సర్కార్ కొత్త 500, 200 నోట్లను ప్రవేశపెట్టింది.  అలాగే 2000 నోటును దించింది.  నోట్ల రద్దు లక్ష్యమే నల్లధనం దాచే వారికి పెద్ద నోట్లు అందుబాటులో ఉంచకూడదని.  కానీ

1000 కంటే పెద్దవైన 2000 నోట్లు ముద్రించి నల్లధనం దాచేవారికి మరింత వెసులుబాటు కల్పించారు.  అడిగితే నగదు చెలామణీలో ఇబ్బందఇబ్బంది ఎదురవుతున్నందున 2000 నోటు తీసుకొచ్చామని, ఇది తాత్కాలికమేనని కారణం చెప్పారు.  మరి ఇన్నాళ్లూ అచ్చుగుద్దిన నోట్లన్నీ ఏమైనట్టు.  మర్చి 31 2020 నాటికి దేశంలో 27,398 లక్షల 2000 నోట్లు మనుగడలో ఉన్నట్టు లెక్కలున్నాయి.  


ఆ నోట్లలో 20 శాతం కూడ ఏంటీఎంలలో, బ్యాంకుల్లో దొరకట్లేదు.  కానీ అవినీతి నిరోధక శాఖ జరుపుతున్న సోదాల్లో పట్టుబడుతున్న కోట్ల రూపాయల నల్లధనం మొత్తం అచ్చంగా 2000 నోట్ల డినామొనేషన్లోనే దొరుకుతోంది.  కావాలంటే ఈమధ్య పట్టుబడిన అవినీతి తిమింగలాల వీడియోలు చూస్తే ఈ విషయం అర్ధమవుతుంది.  ఈ సాక్ష్యం చాలు దేశంలో ఉన్న నల్లధనం మొత్తం చక్కగా 2000 నోట్ల కట్టల రూపంలో ఉందని అనడానికి.  అంటే మోదీ ఏ నల్లకుబేరులను డబ్బు దాచుకునే వీలు లేకుండా చేస్తానని నోట్ల రద్దుచేసి ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బకొట్టారో అదే నల్లకుబేరులు డీమానిటైజేషన్ ముందు కంటే ఇప్పుడు ఎంతో సౌకర్యంగా బ్లాక్ మనీ దాచుకుంటున్నారు.  ఇంతకు ముందు కోటి రూపాయలు దాచగలిగిన చోట ఇప్పుడు 2 కోట్లు దాస్తున్నారన్నమాట.