ప్రత్యక్ష రాజకీయాల్లోకి మంచు విష్ణు.?

సినిమా వేరు, రాజకీయాలు వేరు.. అని చాలా సందర్భాల్లో అనుకుంటాం. కానీ, సినిమా, రాజకీయం వేర్వేరు కాదు. చాలా మంది సినీ ప్రముఖులు రాజకీయాల్లో రాణించారు. కొందరు రాణించలేకపోయారు. కానీ, సినీ నటులు రాజకీయాలపై ఖచ్చితంగా ప్రభావం చూపగలుగుతారు. ఇది చాలా సార్లు నిరూపితమైంది. అసలు విషయంలోకి వస్తే, మంచు మోహన్ బాబు గతంలో రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. మళ్లీ అలాంటి అవకాశం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆయనకు దక్కుతుందంటూ కొన్నాళ్ల క్రితం ప్రచారం జరిగినా, అది నిజం కాలేదు.

మంచు లక్ష్మి, మంచు విష్ణు పేర్లు కూడా రాజకీయ ఊహాగానాల్లో వినిపిస్తూనే ఉన్నాయి. మనోజ్ పేరును కూడా రాజకీయాల్లోకి లాగుతూనే ఉన్నారు. తాజాగా, ‘మా’ ఎన్నికల నేపథ్యంలో మంచు విష్ణు రాజకీయాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్లానింగ్ చేసుకుని ఉంటే, ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా అడుగు పెట్టి రాణించేవాడినేమో.. అని అన్నారాయన.

ఇదిలా ఉంటే, మంచు విష్ణు రాజకీయాల్లోకి రాబోతున్నారని, పవన్ కళ్యాణ్‌కి కౌంటర్‌గా విష్ణును ఎన్నికల బరిలోకి దింపేందుకు ఇటు మోహన్ బాబు, అటు వైఎస్ జగన్ ప్రయత్నిస్తున్నారనీ ఓ ప్రచారం తెర పైకి వచ్చింది. అయితే, ఇదెంత వరకూ నిజం.? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. మోహన్ బాబుకు రాజకీయ అనుభవం ఉంది. కానీ, చాన్నాళ్లుగా ఆయన రాజకీయాల పట్ల కొంత దూరం పాటిస్తున్నారు.

2019 ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రచారం చేసిన మోహన్ బాబు, వచ్చే ఎన్నికల నాటికి ఎలాంటి యాక్టివ్ రోల్ తీసుకుంటారో ఇప్పుడే చెప్పలేం. తన కుమారుడి సమర్ధత పట్ల పూర్తి నమ్మకం మోహన్ బాబుకు ఎప్పుడూ ఉంటుంది. మరి, రాజకీయాలపై విష్ణు ఆలోచన ఎలా ఉందో.. ఈ గాసిప్స్‌పై ఆయన ఎలా స్పందిస్తాడో చూడాలి.