మంచు సంచలనం: పవన్‌తోనూ, చిరంజీవితోనూ మాట్లాడారట

పవన్ కళ్యాణ్, మంచు విష్ణు నిన్న ఓ వేదికపై కలుసుకున్నారుగానీ, మాట్లాడుకోలేదు. మంచు విష్ణు తనంతట తానుగా పవన్ కళ్యాణ్‌ని కలిసేందుకు, మాట్లాడేందుకు ప్రయత్నించినా పవన్ అందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. కానీ, ఈ విషయమై మంచు విష్ణు వాదన ఇంకోలా వుంది. తామిద్దరం చాలాసేపు మాట్లాడుకున్నామనీ, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ని బాగా చూసుకోవాలని పవన్ తనకు సూచించారనీ మంచు విష్ణు చెప్పుకొచ్చాడు.

ఇంకోపక్క మెగాస్టార్ చిరంజీవితో, మంచు మోహన్ బాబు మాట్లాడారట. ‘వాళ్ళిద్దరూ ఫోన్‌లో మాట్లాడుకున్నారు..’ అని మంచు విష్ణు చెప్పడం గమనార్హం. పోటీలోంచి తనను తప్పుకోమని చిరంజీవి, మోహన్ బాబు‌తో చెప్పారంటూ మంచు విష్ణు ఈ మధ్యనే సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.

‘ఆ విషయాన్ని మోహన్ బాబు, చిరంజీవిని అడగండి..’ అంటూ మంచు విష్ణు తాజాగా వ్యాఖ్యానించాడు.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో కనీ వినీ ఎరుగని రీతిలో రచ్చ జరుగుతోంది. సాధారణ రాజకీయాలకు మించి జుగుప్సాకరమైన రాజకీయం సినీ రంగంలోనడుస్తోంది. ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం నడుస్తోంది. మోహన్ బాబు పరోక్షంగా మెగాస్టార్ చిరంజీవి మీదా, పవన్ కళ్యాణ్ మీదా సెటైర్లు వేస్తున్నారు.

ఇంతలోనే మంచు విష్ణు ‘కవరింగ్’ కోసం ప్రయత్నిస్తున్నాడు. అసలు చిరంజీవి, మోహన్ బాబుకి ఫోన్ చేసిన విషయమై (మా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ వ్యవహారంపై) మంచు విష్ణు మీడియా ముందు మాట్లాడకుండా వుండి వుంటే, వివాదం కొంత చల్లారి వుండేదేమో. కానీ, ఆయనా వివాదానికి ఆజ్యం పోశాడు. ఇప్పుడు ఆయనే, ‘ఆల్ ఈజ్ వెల్’ అంటున్నాడు.

అన్నట్టు, ఓ జర్నలిస్టు.. డబ్బింగ్ సినిమాల ద్వారా నిర్మాతగా మారి, ఓ సినిమాలో నటించి, ‘మా’ సభ్యత్వం పొంది, ‘మా’ వాతావరణాన్ని చెడగొట్టాడంటూ మంచు విష్ణు వ్యాఖ్యానించడం కొత్త వివాదానికి దారి తీసింది. అతనెవరన్నదానిపై సినీ జర్నలిస్టుల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

ఇంకోపక్క ప్రకాష్ రాజ్, పోలింగ్ రోజున జరిగిన ఘటనలకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఈ వ్యవహారంపైనా పెద్ద దుమారమే చెలరేగుతోంది. ‘ఆయన నిస్సంకోచంగా వాటిని చూసుకోవచ్చు..’ అని మంచు విష్ణు వెల్లడించడం మరో ఆసక్తికర పరిణామం.