తెలంగాణలో 50 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్న మంచు లక్ష్మి..మంచి మనసంటు కామెంట్స్?

డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి గురించి తెలియని వారంటూ ఉండరు. ఈవిడ మాట్లాడే తెలుగు వల్ల ఎన్నో విమర్శలు ఎదుర్కొంటూనే ఉంది. ప్రతిసారి ఇలా మీడియా ముందు వచ్చిరాన్ని తెలుగులో మాట్లాడుతూ విమర్శలు ఎదుర్కొంటున్న మంచు లక్ష్మి చాలా సినిమాలలో ప్రధాన పాత్రలలో నటించి నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. అంతేకాకుండా బుల్లితెర మీద ప్రసారమైన లక్ష్మి టాక్ షో కి హోస్ట్ గా కూడా వ్యవహరించింది. లక్ష్మీ మంచు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకి తన కూతురికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన పర్సనల్ విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

ఇలా మంచు వారి అమ్మాయిగా మంచి గుర్తింపు పొందిన లక్ష్మీ మంచు అనేక సేవా కార్యక్రమాలను కూడా చేస్తూ తన మంచి మనసు చాటుకుంటుంది. ఇప్పటికే టెక్ ఫర్ చేంజ్ అనే కార్యక్రమంతో టీచర్స్ లేని ప్రభుత్వ పాఠశాలల్లో పాఠాలు చెప్పిస్తోంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఈ కార్యక్రమం జరుగుతుంది. తాజాగా లక్ష్మీ మంచు మరో మంచి పనికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా మంచు లక్ష్మి 50 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న 50 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని వాటిని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చింది.

ఇటీవల యాదాద్రి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న మంచు లక్ష్మి తన టెక్ ఫర్ చేంజ్ సంస్థతోనే 50 స్కూళ్లు దత్తత తీసుకొని వాటిని అభివృద్ధి చేస్తానని ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా 1 నుంచి 5 తరగతుల వరకు మూడు సంవత్సరాల పాటు స్మార్ట్‌ క్లాసెస్‌ నిర్వహిస్తూనే, పిల్లలకు అవసరమైన పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తూ ఆ స్కూల్స్ లో కనీస అవసరాలు ఏర్పాటు చేస్తామని మంచు లక్ష్మి తెలిపింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు యాదాద్రి జిల్లా కలెక్టర్ ట్విట్టర్ లో షేర్ చేశాడు. లక్ష్మీ మంచు చేస్తున్న ఈ మంచి పనికి అందరూ ఆమెకి అభినందిస్తున్నారు.