ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత కూడా పశ్చిమబెంగాల్ రావణ కాష్టంలా రగులుతోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమ పార్టీ కార్యకర్తల్ని హిందువులపైకి, అందునా బీజేపీ కార్యకర్తలపైకి ఉసిగొల్పుతున్నారంటూ కమలనాథులు వాపోతున్నారు. వెంటనే పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించెయ్యాలంటూ బీజేపీ సోషల్ మీడియా వేదికగా యుద్ధం షురూ చేసింది. మరోపక్క, బెంగాల్ రాష్ట్రంలోని కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలుగా చెప్పబడుతున్న కొందరు, దాడులకు తెగబడుతున్నారు. పోలీసులపైనా విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో కొందరు ప్రాణాలు కోల్పోయారంటూ బీజేపీ, సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెడుతోంది. నిజంగానే బెంగాల్ రాష్ట్రంలో హింస, అదుపు చేయలేని స్థితిలో వుందా.? రాష్ట్రపతిపాలన అక్కడ అవసరమా.? మరోమారు ముఖ్యమంత్రి కాబోతున్న మమతా బెనర్జీ, ఈ సమయంలో ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులకు ఎందుకు అవకాశమిస్తారు.?
మమత వైపునుంచి అయితే ఇలాంటి ఘటనలకు ఆస్కారం వుండదు. కానీ, బెంగాల్ రాష్ట్రంలో అలజడి సృష్టించి, ఆ మకిలిని మమతా బెనర్జీకి అంటించేస్తే, బెంగాల్ రాష్ట్రం రావణ కాష్టంలా మారుతుందనీ, ఆ మంటల్లో చలికాచుకోవచ్చని బహుశా బీజేపీ భావిస్తుందేమోన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఎలాగైనా మమతా బెనర్జీని ఓడించాలని కంకణం కట్టుకుంది బీజేపీ. ఈ క్రమంలోనే తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితులైనవారిని బీజేపీ, తన వైపుకు తిప్పుకుంది. నిజానికి, మమత ముఖ్యమంత్రిగా వున్నప్పుడే ఆమె ప్రభుత్వాన్ని కూల్చేయాలని ప్రయత్నించిన బీజేపీ, బెంగాల్ రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది. ఆ లెక్కన, ఇప్పుడు జరుగుతున్న ఈ విధ్వంసాలకు సైతం బీజేపీనే స్కెచ్ వేసి వుండొచ్చన్న అనుమానాలు బలపడ్డంలో వింతేముంది.?