తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి జాతీయ రాజకీయాలు కొత్తేమీ కాదు. గతంలో ఆమె కేంద్ర మంత్రిగా పనిచేశారు. జాతీయ స్థాయిలో వివిధ రాజకీయ పార్టీలతో ఆమెకు సన్నిహిత సంబంధాలున్నాయి. చాలా ప్రాంతీయ పార్టీలతోనూ సన్నిహిత సంబంధాలు నడపడంలో మమతా బెనర్జీ దిట్ట. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలనుకున్న బీజేపీ కోరిక నెరవేరలేదు. మమతా బెనర్జీ ఓడిపోయినా, ఆమె తన పార్టీని గెలిపించుకుని.. అధికారాన్ని నిలబెట్టుకున్న విషయం విదితమే. అతి త్వరలో ఆమె తిరిగి అసెంబ్లీకి ఎన్నికవ్వాల్సి వుంటుంది. ఇదిలా వుంటే, మమతా బెనర్జీ జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు.
2024 ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా ఆమె నిలబడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే మమతా బెనర్జీ ప్రధాని అభ్యర్థిత్వంపై వివిధ పార్టీలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ సహా, పలు బీజేపీ వ్యతిరేక పార్టీలను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు ప్రశాంత్ కిషోర్. ఢిల్లీ ముఖ్యమంత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి.. ఇలా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మమతా బెనర్జీని ప్రధాని అభ్యర్థిగా సమర్థించే అవకాశం వుంది. తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు, కేసీయార్, వైఎస్ జగన్ కూడా మమతా బెనర్జీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించే పరిస్థితి వుండకపోవచ్చు. కానీ, ఇప్పటి ఈక్వేషన్స్ చూసి, భవిష్యత్ సమీకరణాల్ని అంచనా వేయలేం. రాజకీయాలు ఎప్పటికప్పుడు అనూహ్యంగా మారిపోతుంటాయ్. ఆ విషయం మమతా బెనర్జీకి కూడా బాగా తెలుసు. అందుకే, సమయం వచ్చినప్పుడు ఆ విషయాలపై మాట్లాడతానంటూ ప్రస్తుతానికి జాతీయ స్థాయిలో తన ప్రాబల్యం పెంచుకోవడంపై ఫోకస్ పెట్టారు.