Mahesh Vs Chiranjeevi : మహేష్ వర్సెస్ చిరంజీవి.. అసలేం జరిగిందంటే.!

Mahesh Vs Chiranjeevi :  ఏప్రిల్ 1వ తేదీన ‘సర్కారు వారిపాట’ సినిమా విడుదల కావాల్సి వుంది. కానీ, అదే తేదీన తమ సినిమా విడుదలవుతుందంటూ ‘ఆచార్య’ నుంచి ప్రకటన వచ్చింది. దాంతో చిరంజీవి వర్సెస్ మహేష్.. అంటూ సోషల్ మీడియాలో అభిమానుల కొట్లాట షురూ అయ్యింది.

కోవిడ్ కారణంగా పెద్ద సినిమాల పరిస్థితి అయోమయంలో పడిపోయింది. ఏ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి. నిజానికి, ‘సర్కారు వారి పాట’ సంక్రాంతికే విడుదలవ్వాలి. కానీ, కొన్ని కారణాలతో సినిమా విడుదలను వాయిదా వేశారు. అది ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ కోసమేనని గతంలో ప్రచారం జరిగింది. అందులోనూ కొంత వాస్తవం లేకపోలేదు.

ఇక, ‘భీమ్లానాయక్’ కూడా ఆ రెండు సినిమాల కోసమే వాయిదా పడిన మాట వాస్తవం. ‘ఆచార్య’ పరిస్థితీ ఇంతే. సంక్రాంతి నుంచి ఫిబ్రవరికి వెళ్ళి, ఇప్పుడు ఏప్రిల్ 1 వైపు చూడాల్సి వస్తోంది. మారిన పరిస్థితుల నేపథ్యంలో దాదాపుగా అన్ని పెద్ద సినిమాల విడుదలలూ రీ షెడ్యూల్ అవ్వాల్సిందే. ఇందుకు ఏ సినిమా కూడా మినహాయింపు కాదు.

మహేష్ – చిరంజీవి మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. చరణ్ – మహేష్ మధ్య స్నేహం గురించి అందరికీ తెలిసిందే. కొరటాల శివ – మహేష్ కూడా మంచి స్నేహితులు. ఎలా చూసినా, ‘ఆచార్య’, ‘సర్కారు వారి పాట’ సినిమాల మధ్య ఆధిపత్య పోరు అన్న మాటకే ఆస్కారం లేదు.

ఇటీవల కాలికి సర్జరీ చేయించుకున్న మహేష్, ఆ తర్వాత వెంటనే కోవిడ్ బారిన పడ్డాడు. అలా ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్ కూడా కొంత అయోమయంలో పడింది. ఈ కారణంగానే ‘సర్కారు వారి పాట’ వెనక్కి వెళ్ళిందనీ, ఆ విషయం తెలుసుకునే ‘ఆచార్య’ టీమ్, ‘సర్కారు వారి పాట’ టీమ్‌తో చర్చించి తమ డేట్ అనౌన్స్ చేసిందనీ అంటున్నారు.