మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ మంగళవారం కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన లఖనవూలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతు తుదిశ్వాస విడిచారు. కడుపులోని అంతర్గత రక్తస్రావానికి సంబంధించి టాండన్ కు గతంలో శస్ర్త చికిత్స జరిగింది. ఈ నేపథ్యంలో శ్వాస ఇబ్బందులు, జ్వరం రావడంతో ఈనెల 11న ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న నేపథ్యంలో మంగళవారం ఆరోగ్య విషమించడంతో కన్నుమూసినట్లు తెలుస్తోంది. ఆయన మృతిపట్ల ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేసారు. ఉత్తరప్రదేశ్లో భాజాపాని బలోపేతం చేయడంలో టాండన్ కీలక పాత్ర పోషించారన్నారు.
ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ పాలనలో చెరగని ముద్ర వేసారన్నారు. ఆయన మరణం తీవ్ర ఆవేదనకు గురిచేస్తుందని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. టాండన్ సేవలు చిరస్మరణీయమని, ప్రజలు మెచ్చిన నాయకుడిగా టాండన్ ఎప్పటికీ గుర్తుండిపోతారని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. లఖన్ వూ సమీపంలోని చౌక్ నవూ గ్రామంలో టాండన్ జన్మించారు. 2019 జులై 20న మధ్యప్రదేశ్ గవర్నర్ గా నియమితులయ్యారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. టాండన్ 1970 లో కార్పోరేటర్ గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. పదేళ్ల తర్వాత ఉత్తరప్రదేశ్ శాసనమండలికి ఎన్నికయ్యారు. 1991 నుంచి 2003 మధ్య పలుమార్లు మంత్రిగా పనిచేసారు.