‘మా’ రాజకీయం మళ్ళీ మొదటికొచ్చింది.!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల తర్వాత కూడా హాటు, హాటు వాతావరణం సినీ పరిశ్రమలో కనిపిస్తోంది. అయితే, గతంతో పోల్చితే ఈ వేడి కాస్త తక్కువేనని చెప్పాలి. కానీ, మళ్ళీ నిప్పు రాజుకుంటోంది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కార్యాలయం మూతపడిందన్న ప్రచారంతో సినీ పరిశ్రమలో అలజడి బయల్దేరింది.

తమ సమస్యలు చెప్పుకోవడానికి కార్యాలయానికి వెళితే, అక్కడెవరూ వుండడంలేదన్నది కొందరి ఆరోపణ. ఈ మేరకు సోషల్ మీడియాలో కొన్ని సెల్ఫీ వీడియోలు, ఫొటోలు దర్శనమిస్తున్నాయి. ‘మా’ కార్యవర్గం నిత్యం సభ్యులకు అందుబాటులో వుండాలి. కానీ, ఎవరికి వారికి వారి వారి సినిమాల వ్యాపకాలుంటాయి గనుక, అందరూ ప్రతిరోజూ అందుబాటులో వుండలేరు.

వారి వారి అవకాశాల్ని బట్టి, అను నిత్యం కొందరైనా అందుబాటులో వుండాలి కదా.? కానీ, ఆ పరిస్థితి లేదట. అదే అసలు సమస్య. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు.. ఈ ఇద్దరూ ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం పోటీపడితే, మంచు విష్ణు గెలిచాడు. మంచు విష్ణు ప్యానెల్ నుంచీ అలాగే ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచీ గెలిచినవారు కార్యవర్గంలో వుండాలి. కానీ, ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచినవారంతా తమ రాజీనామాల్ని ప్రకటించేశారు.

ఆ వ్యవహారంపై తదుపరి పరిణామాలేంటన్నది బయటకు పొక్కకపోవడం గమనార్హం. సరే, అది అంతర్గత రాజకీయం అని సరిపెట్టుకోవచ్చు. కానీ, అసలు ‘మా’ కార్యాలయమే మూతపడిందంటే ఎలా.? దీనిపై మంచు విష్ణు ఇంకా స్పందించాల్సి వుంది.

‘మా’ సభ్యులకు వైద్య సేవ అనీ, ఇంకోటనీ ఏవేవో ప్రకటనలు మంచు విష్ణు నుంచి వస్తున్నాయి. కొత్త అధ్యక్షుడు కదా, ఈ వ్యవహారాల్లో బిజీగా వుండి వుంటాడు. కానీ, కార్యాలయమే అందుబాటులో లేకపోతే ఎలా సామీ.. అంటూ తన మీద వస్తున్న సెటైర్లకు మంచు విష్ణు సమాధానం చెప్పి తీరాల్సిందే.