‘మా’ రాజకీయం: తెలుగు నటుల ఆత్మగౌరవం కోసం.?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అంటే, అది తెలుగు సినీ నటీనటుల ఆత్మగౌరవం కోసమా.? ఇప్పుడీ చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది. ‘మా’ ఆత్మగౌరవం.. అంటూ మంచు విష్ణు ఇచ్చిన స్లోగన్ చుట్టూ చిత్ర విచిత్రమైన వాదనలు వినిపిస్తున్నాయి. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యలుగా కోట్లు గడించిన నటీనటులున్నారు.. పూట గడవని కడు పేదలు కూడా వున్నారు. మరి, ఎవరి ఆత్మగౌరవం కోసం ఈ ఎన్నికలు.? కేవలం తెలుగు సినీ నటీనటుల కోసమా.? అలాగే అనుకోవాలేమో. ఎందుకంటే, అటువైపున్నది ప్రకాష్ రాజ్. ఆయన తెలుగువాడు కాదు. కానీ, తెలుగు సినిమాల్లో నటించాడు.

బంతిని ప్రకాష్ రాజ్ కోర్టులోకి నెట్టేసిన విష్ణు, ‘నేను తెలుగు ఫిలిం ఛాంబర్ తరఫున నిలబడ్డాను. నువ్వెవరి తరఫున నిలబడ్డావ్.? తెలుగు సినిమా ఛాంబర్ తరఫునా.? పవన్ కళ్యాణ్ తరఫునా.? నేనైతే, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని సమర్థించను.. ఆయన వ్యాఖ్యలతో ఏకీభవించను..’ అని విష్ణు స్పష్టం చేసేశారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్లో రాజకీయ విమర్శల్ని విష్ణు సహించకపోవచ్చుగాక. రాజకీయంగా పవన్ కళ్యాణ్‌తో ప్రకాష్ రాజ్‌‌కి కూడా విభేదాలున్నాయి. కానీ, పవన్.. సినీ పరిశ్రమ గురించి మాట్లాడాడు.. పరిశ్రమ సమస్యల్ని ప్రస్తావించాడు. అది విష్ణుకి నచ్చకపోతే ఎలా.? ‘మా’ ఎన్నికల్లోకి రాజకీయాల్ని లాగొద్దంటూనే, మంచు విష్ణు చెయ్యాల్సిన రాజకీయమంతా చేసేశారు. పవన్ కళ్యాణ్ ఓటు కూడా నాకే పడుతుందని కాన్ఫిడెంట్‌గా చెబుతున్న విష్ణు, పవన్ కళ్యాణ్ తరఫున మాట్లాడతావా.? తెలుగు ఫిలిం ఛాంబర్ తరఫున మాట్లాడతావా.? అని ప్రశ్నంచడమే అర్థం లేనిది.